Posted by: చైతన్య | March 2, 2007

డైట్ కోక్! తస్మాత్ జాగ్రత్త!

Diet Cokeకోక కోలా (Coca Cola) సంస్థ ‘డైట్ కోక్’ (Diet Coke) ని జులై 1982 ల మొదటిసారి అమెరికా మార్కెట్‌లకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంల అన్నిటికన్న ఎక్కువ సేవించబడుతున్న కార్బొనేటెడ్ డ్రింక్స్‌ల (carbonated drinks) డైట్ కోక్ నాల్గవ స్థానంల ఉన్నది. ఒక్క డైట్ కోక్ సేల్స్ తోనే కొకా కోలా సంస్థకి ప్రతి ఏటా బిలియన్ డాలర్ల ఆదాయం ఒస్తుంది (అంటె దాదాపు ‘నాలుగున్నర వేల కోట్ల’ రూపాయలన్నమాట).

1885 ల మొదటిసారి తయారుచేయబడిన కోకా కోలా, దక్షిణ అమెరికా నుండి వచ్చిన కోకా ఆకులను (Coca leaves) ఉపయోగించి తయారు చేసినందుకు ఆ పేరు పెట్టుడు జరిగింది. కోకా ఆకుల నుండే కొకేన్ (Cocaine) అనే నిషేధిత పదార్థం తయారు చేస్తరు కదా! తయారయిన మొదట్ల చాలా ఏళ్ల వరకు కోకా కోలాల కొకేన్ ఎక్కువ శాతంలనే కలుస్తుండెనట. అయితె రాను రాను అదివరకే కొకేన్ ని తీసేసిన కోకా ఆకులను (‘spent’ leaves) కోక్ తయారుల వాడుడు మొదలు పెట్టింరట. ప్రస్తుతం కూడా ఈ ‘స్పెంట్ లీవ్స్’ నే కోక్ ల వాడుతుంటరని, ‘స్పెంట్ లీవ్స్’ ల కూడా ఎంతో కొంత కొకేన్ ఆల్కలాయిడ్ (alkaloid) అవశేషాలు మిగిలి ఉంటయని రకరకాల వాదనలున్నయి. కోకా కోలాల కొకేన్ అవశేషాల గురించి కోకా కోలా సంస్థ ఎన్నో ఏళ్ల నుంచి ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడానికైనా నిరాకరిస్తనే ఉంది. ఇగ ఒక కోక్ కాన్ (can) ల ఉండే చక్కెర శాతం 10% లేదా సుమారు 9 టీ స్పూన్‌లు (45 గ్రాములు). చక్కెరని ఈ మోతాదుల్ల తిండిల వినియోగిస్తే వచ్చే స్థూలకాయత్వ (obesity) సమస్యల గురించి వేరేగా చెప్పనవసరం లేదు.

ఇగ కోకాకోలాల కొకేన్, చక్కెరల సంగతి పక్కన పెడితే నేను ఇప్పుడు డైట్ కోక్ గురించి మాట్లాడదలుచుకున్నా! టి.వి లల్ల మోడల్స్‌ని, సినిమా తారలని చూసి వాళ్ళ లెక్కనే నాజూకుగా ఉండాలనుకునే అమ్మాయిల దగ్గర నుండి మొదలు పెట్టి, సినిమా హీరోల లెక్క శరీరాలని ‘షేప్’ల ఉంచుకోవాలనుకునే మొగపిల్లలు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ‘డైట్ కాన్షియస్’ మనుషులు, ఇట్ల రకరకాల కారణాలతో చక్కెర లేకుండా తయారు చేసే డైట్ కోక్ ని చాలా మంది తాగడం మొదలు పెట్టింరు. డైట్ కోక్ ని సాధారణ కోక్ కి ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నరు.

ఆరోగ్యకరమైన కోలాగా చాలా మంది అభిమానాన్ని చూరగొన్న డైట్ కోక్ ల ఆస్పార్టేమ్ (aspartame), అసిసల్ఫేమ్ (acesulfame) అనే కృత్రిమ అధిక తీపి పదార్థాలు (artificial high intensity sweeteners), ఫాస్ఫారిక్ ఆసిడ్, (phosphoric acid), సల్ఫైట్ అమోనియా కారమెల్ (sulphite ammonia caramel) అనే రంగు పదార్థం, కెఫీన్ (caffeine), ఇంకా బయటపెట్టబడని ఎన్నో ‘ఫ్లేవరింగ్స్’ (flavorings) ఉంటయి. అట్లనే డైట్ కోక్ ల సోడియం బెన్జోయేట్ (Sodium benzoate), సిట్రిక్ ఆసిడ్ (citric acid) కూడా ఉంటయి.

ఆస్పార్టేమ్, అసిసల్ఫేమ్ లకు నరాలకు హాని కలిగించే (neurotoxic) లక్షణమే కాకుండా కాన్సర్‌ని కలిగించే (carcinogenic) లక్షణాలు ఉన్నయి. FDA రిపోర్టుల ప్రకారం ఆస్పార్టేమ్ వల్ల తల నొప్పి, కళ్ళు తిరుగుడు, జ్ఞాపకశక్తి లోపించుడు, కండరాల బలహీనత, కీళ్ల నొప్పులు మొదలైన ఆరోగ్య సమస్యలు కలుగుతయి. ఇటీవలి కాలంల జరిగిన పరిశోధనలల్ల ఆస్పార్టేమ్ వల్ల లింఫోమా (lymphoma) అనే మెదడు కాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేలింది.

అసిసల్ఫేమ్ వల్ల జంతువులల్ల కాన్సర్ రావడమే కాకుండా థైరాయ్డ్ (thyroid) గ్రంథికి కూడా హానికలుగుతుందని పరిశోధనలల్ల తెలిసింది.

ఫాస్ఫారిక్ ఆసిడ్ పళ్లకు, ఎముకలకు హాని కలుగజేస్తుంది.

సిట్రిక్ ఆసిడ్ పంటి ఎనామెల్‌కి హాని కలిగించినా దానంతట అది అంత హానికరమైన పదార్థము ఏమీ కాదు. అయితే నిలువ ఉండే క్రమంల సోడియం లేదా పొటాషియం బెన్జొయేట్ తోటి కలిసినప్పుడు, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భాలల్ల కాన్సర్ కారక బెంజిన్ (benzene) తయారవ్వడానికి సిట్రిక్ ఆసిడ్ తోడ్పడుతది. ఇట్లా తయారవుతున్న బెంజిన్ సాఫ్ట్ డ్రింక్స్‌ల ‘సురక్షితమైన పరిమాణాల’ (safe doses) కన్నా 40 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలల్ల వెల్లడయింది.

సల్ఫైట్ అమోనియా కారమెల్ అనే రంగు పదార్థం చక్కెర, అమోనియా, సల్ఫైట్ ఉన్న పదార్థాల మిశ్రమాన్ని వేడి చేసి తయారుచేస్తరు. అమోనియా ఏ విధంగా మనిషి శరీరంలకి చేరినా హాని కలుగజేస్తది. అమోనియాతో చేయబడిన ఈ రంగు పదార్థం, జన్యువులకు (genes), పిల్లల పెరుగుదలకు, పేగులకు, మూత్రపిండాలకు హాని చేసే అవకాశం ఉంది. ఈ రంగు పదార్థం కలుగజేసే హానికరమైన ప్రభావాలపై పూర్తి పరిశోధనలు జరపకుండనే దీనిని డైట్ కోక్ ల ఉపయోగిస్తున్నరు.

Saccharin warning on Dr.Pepper can

ఇగ షాపులల్ల బాటిల్స్ లేదా టిన్స్‌ల దొరికే డైట్ కోక్, సినిమా థియేటర్‌లల్ల ఫౌంటెన్స్ నుండి కప్‌ల నింపుకునే డైట్ కోక్ ఒకటే అనుకుంటే పొరపాటే. ఫౌంటెన్స్‌ల నింపే డైట్ కోక్‌ల ఆస్పార్టేమ్‌తో పాటు ఎక్కువ ఉష్ణోగ్రతల కూడా తీపి కోల్పోకుండా ఉండడానికి సాకరీన్ (saccharin) కూడా వాడడం జరుగుతుంది. వివిధ పరిశోధనలల్ల సాకరిన్ ఎలుకలల్ల కాన్సర్ కలుగజేస్తుందని తేలినంక 1977ల దానిని అమెరికాల నిషేధించడం జరిగింది. అయితే తర్వాతి కాలంల జరిగిన పరిశోధనలల్ల సాకరిన్ వల్ల మనుషులకు కాన్సర్ రాదని నిర్ధారించడంతో 1991ల నిషేధం ఎత్తివేయబడింది. అయితే చాలా ఇతర దేశాలల్ల సాకరీన్ పై నిషేధం కొనసాగుతనే ఉన్నది. సాకరీన్ పై ఇప్పటికీ రకరకాల వాదనలు ఉన్నయి.

ఇదంతా చెప్పినంక డైట్ కోక్ తాగాల్నా వద్దా అంటే అది తాగేవాళ్లు నిర్ణయించుకోవాల్సిందే. అయితే తాగేముందు అందుల ఉండే పదార్థాల గురించి తెలుసుకోని నిర్ణయించుకుంటె బాగుంటది. ఈ విషయం ఆలోచింపజేయడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది. మీరు ఇంకా తెలుసుకోవాలంటే ఇంటర్నెట్‌ల ఆయా పదార్థాల గురించి చాలా సమాచారం దొరుకుతది.

– డా|| చైతన్య

ప్రధాన మూలం: The Ecologist Magazine

PS: Also Visit Killer COKE for more details


Responses

 1. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా ‘ఫాస్పారిక్ ఆసిడ్’ తాగిన వారిలో ముఖ్యంగా ఆడవారిలో ‘ఆస్టియోపోరోసిస్’ ఎముక ధాతుక్షీణత జరుగుతోందని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. నాకెప్పటి నుంచో ఒక అనుమానం అమెరికన్లలో ఎక్కువగా ఉండే క్యాన్సర్లకు కారణం ఇలాంటి కృత్రిమ పదార్థాలేనా అని?

 2. ‘ఫాస్పారిక్ ఆసిడ్’ ఉన్న కోలాలు తాగిన వారిలో…అని చదువుకోగలరు!

 3. డైట్ కోక్ ఆర్టికల్ చదివాము. ఇట్ల ఎన్ని ఆకర్షణలతో పేద దేశాలకు కాన్సర్ వంటి చికిత్సలేని costly జబ్బులను అమెరికా దిగుమతి చేస్తున్నదో కదా? ఇక్కడ పిల్లలు ఇది తాగుతున్నట్టు లేదు, లేక మా దృష్టికి రాలేదేమో. ఏమైనా god save the world from imperialist attractions

 4. నేను “0” కాలరీస్ అదీ అని డైట్ స్ప్రైట్ తాగుతాను.అందులో కూడా ఇలాంటివి వున్నాయా?అది తాగినా స్తూలకాయం వస్తుందా?

 5. రాధిక గారు,

  స్ప్రైట్ ని కూడా కోక కోలా సంస్థనే తయారుచేస్తుంది. ‘0’ కాలరీస్ అని చెప్పబడే డైట్ కోక్ కాని, డైట్ స్ప్రైట్ ల కాని నిజంగనే అతి తక్కువ కాలరీస్ (1-2 Cal) ఉంటయి. ఎందుకంటే వాటిల చక్కెర వాడడానికి బదులు కృత్రిమ తీపి పదార్థాలు వాడుతున్నరు. ఆస్పర్టేమ్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు చక్కెర కన్నా చాలా రెట్లు తీపిగా ఉండటంతో (ఉదాహరణకు ఆస్పర్టేమ్ చక్కెర కన్నా 180 రెట్లు తీపిగా ఉంటుంది) అతి తక్కువ పరిమాణాలు వాడి డైట్ డ్రింక్స్ ని తయారుచేయవచ్చు. అంటే సుమారు 45 గ్రాములతో తయారయ్యే రెగ్యులర్ కోక్ లేదా స్ప్రైట్ బదులు 45/180 అంటే 0.25 గ్రాముల ఆస్పార్టేమ్ తో డైట్ కోక్ తయారుచేయవచ్చు. తద్వారా డైట్ డ్రింక్స్ ల సుమారు ‘0-2’ కాలరీస్ మాత్రమే ఉంటయి.

  ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, డైట్ డ్రింక్స్ తాగడం వల్ల స్థూలకాయం వస్తుందా అంటే లేదు ఎందుకంటే వీటిల అతి తక్కువ కాలరీస్ ఉంటాయి. స్థూలకాయం రెగ్యులర్ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే అవకాశం ఉంది.

  డైట్ స్ప్రైట్ ల కూడా డైట్ కోక్ ల ఉన్నటువంటి పదార్థాలు ఉంటయా అంటే అవును ఉంటయి. డైట్ స్ప్రైట్ ల కూడా దాదాపు అవే కృత్రిమ తీపి పదార్థాలు, అవే ఫాస్ఫారిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, పొటాషియం బెన్జొయేట్ వాడడం జరుగుతుంది. కేవలం అందుల ఉండే ఫ్లేవర్స్ మాత్రమే వేరు.

  మామూలుగనే వయసు పెరిగినా కొద్ది (ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత) ఆడవాళ్లలో ఎస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది. అయితే ఇస్మాయిల్ గారు అన్నట్టు, ఫాస్ఫారిక్ ఆసిడ్ ఉన్న కోలాలు తాగడం వల్ల ఆ రిస్క్ పెరగడమే కాకుండా తక్కువ వయసులనే ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఉన్నయి.

 6. మా కాలేజ్ లో మాత్రం కోక్ ప్రాడక్ట్స్ అంటే అమ్రుతం తో సమానం !! మంచి నీళ్ళ పాకెట్ల కంటే ఇవే ఎక్కువగా అమ్ముడుపోతాయి !! మొన్నామధ్య వీటి మీద అలిగేషన్స్ వచ్చినా తాగడం ఆపలేదు నాకు తెలిసిన వారు , ఎవరూ నాతో సహా ..

 7. good job chaitanya

 8. Also Read ‘The Truth About Diet Soda‘ on Yahoo health http://health.yahoo.com/experts/eatthis/22630/the-truth-about-diet-soda/

  Excerpts:

  Just because diet soda is low in calories doesn’t mean it can’t lead to weight gain.
  Guzzling these drinks all day long forces out the healthy beverages you need.
  There remain some concerns over aspartame, the low-calorie chemical used to give diet sodas their flavor.
  The best way to hydrate is by drinking low-calorie, high-nutrient fluids—and avoiding belt-busting beverages


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: