Posted by: JayaPrakash Telangana | March 14, 2008

గతి

బోరుకు వచ్చింది బండి. ఇంకో ఎత్తుగడ్డ ఎక్కితె అడ్డం బడుతది అన్నట్టు ఉన్న బండిని ఏసుకొని బయల్దేరిండు శీను. ఇయ్యాల పని ఎగ్గొట్టి ఎక్కడికి పోవాలని పరధ్యానంల బండి తోలుతుంటె కండ్ల ముందటి నుంచి ఒక కాయితం ముక్కసొంటిదేదో తేలుకుంట పొయ్యింది., దాని తోటి ఇదివరకే పరిచయం ఉన్నట్టే రెప్పపాటులనే గుర్తు పట్టినట్టు దబ్బున బ్రేకు మీద కాలేసిండు.

ఓవర్ బ్రిడ్జికి ఓ పది అడుగుల దూరంల పొయ్యి బండి ఆపి స్టాండు ఏసి, ట్రాఫిక్‌ని ఎదురీదుకుంట “చిన్నప్పుడు విడిపోయిన దోస్తు, ఇరవై ఏల్లకు ఎదురైండు” అన్నట్టు పలకరించబోయిండు. రోడ్డు పక్కన ఫెన్సింగ్‌ల ఇరుక్కున్న కాయితం ముక్క మీద గాంధీ తాత ముత్యాలు రాల్సుకుంట “హలో!” అన్నడు. “హలో! హల్లో! తాత అనుకున్నదాని కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉత్సాహంతోటి ఎదురైనవు గద!” అని ‘500’ల అంకెను సుతారంగ నిమిరి, మడిచి సీక్రెట్ పాకెట్‌ల పెట్టబోయి తీసి ఎనుక జేబుల బెట్టిండు.

“చలో తాత! సైర్ కరాతా హూ తుమే” అనుకుంట బండి కాడికి పోయి, ఒక సారి ముందుకు ఎనుకను సూశి వంచి, ఒక్క కిక్కుల బండి స్టార్ట్ జేసి, గాలికి ముచ్చట్లు జెప్పవట్టిండు.

* * *

“Which Airlines is it sir?”
“It’s Terminal C, to the Continental”
“just making sure., if I find it out ahead of time I don’t have to worry about it later”
“True !”
“that’s why I make sure I’m at the pickup half hour early… that way even if I have trouble finding the address I’ll have time..”

మోగుతున్న సెల్ ఫోన్ దిక్కు జూసి, చెవిల ఏల్లాడుతున్న బ్లూ టూత్ ని గిచ్చిండు గ్రెగ్…

“Yeah! I’m on way to the airport… yeah Newark…! Sure I’ll be there…”

“Sorry sir! That was my girl friend”
“Is this your last pick up for the day Greg ?!”
“No sir! the first!”
“Is it busy for you guys this Christmas season?”
“Yes sir! But it’s kind of slow since a couple of days because of the weather. It was mad yesterday… it’s alright though now. This is good, if there is no rain or snow.., I drive fast, but in bad weather NOOOO !” అనుకుంట ధీర్ఘం తీసిండు.
“…after I drop you off at the airport, I’m gonna go home make me some hot coffee, watch some news. If my boss calls me and asks me to pick someone from JFK or Philly, I’m going to do that.”
“…pick some other passenger…”
“…may be I’ll make myself a sandwich or warm something up from the fridge…”

“Ahaaa !” తను మాట్లాడనీకి పెద్దగ ఏం లేదు కాబట్టి ‘ఊ!’ కొట్టుకుంట కూసున్నడు రమేశ్, లిమో కిటికీల నుంచి బయిట కమ్ముతున్న పొగ మంచును సూసుకుంట.

ఎదుట మనిషి ఇంటున్నడా లేదా అన్న పట్టింపుగూడ లేకుంట గ్రెగ్ ముచ్చట చెప్పుకుంటనే పోతున్నడు.

“I drive around all night, I take all the money and put it in front of my girl friend and ask her to lay it down… when I’m at home I want food on the plate… I don’t wanna know if there is no milk… no groceries… I don’t care…I’m working hard… I don’t wanna be bothered when I’m home. If she wants to polish her nails or do her hair she better do it in her own time… she gotta get some food ready before I get home… and then she can so what ever the damn she wants to do in her own time!”

మబ్బులు కమ్మిన ఆకాశం అంత ఎర్రగ ఎలుగుతుంది… హాలోజెన్ లైట్‌ల ఎలుతురుల ! మబ్బులు గమ్మిన ఆకాశంల గూడ మినుకు మినుకుమంటున్న నక్షత్రాలు… ఏర్‌పోర్ట్ దగ్గర బడుతున్నట్టుంది.

* * *

“ఏం తాతా! నార్త్ ఇండియానా? సౌత్ ఇండియానా?” అని బండి రోడ్ మీద ఆపి శీను రోడ్డుకు అటు ఉన్న ‘పంజాబీ ధాబ’ ఇటు ఉన్న ‘కామిని బార్ & రెస్టారెంట్’ల దిక్కు కొంచంసేపు ఘురాయించిండు.
“పండ్లు లేవ్వని ఫీల్ అయితున్నవా తాత! అరే ఫికర్ జెయ్యకు నేనున్న గద” అనుకుంట బొయ్యి ధాబా కాడ ఆపి ఓ సిగిరెట్ ఎలిగిచ్చుకుంట పొయ్యి లోపల ఓ గుడిసెల కూసున్నడు.

జర సేపటికి ఆడ పని జేస్తున్న పిలగాడు నీల్ల గ్లాసులు తెచ్చి పెట్టి ఆడర్ తీసుకోనీకి నిలబడ్డడు…
“ఏం గిలాసలు బే ఇవి! కడుక్కొని మల్ల పట్టుకరా పో !” అని కసిరిండు. ఆ పోరడు పొయినట్టే పొయ్యి మల్ల అవే గ్లాసల నీల్లు తెచ్చి పెట్టిండు. ఇంతల్నే బల్ల మీదున్న సెల్ ఫోన్ మోగుడు మొదలు పెట్టింది, దాన్ని సూశి సూడనట్టు ఆడర్ జెప్పిండు శీను.

ఇంకా జనాలు నాష్తా జేసే టైం కి వీడేందిరా బాబు అని నెత్తి గోక్కుంట ఒక హాఫ్ బాటిల్, రెండు సోడా సీసాలు తెచ్చి ముందట బెట్టిండు. బైటికి పోతుంటె పోరన్ని ఆపి
“అరే ఛోటే! ఏక్ బడా లేకే ఆరే?” అని సీసా సీల్ ఇప్పుకుంట “ఇంక ఈడనే ఉన్నవేందిరా?” అన్నడు శీను
“పాన్ డబ్బాల ఖాతాలు బంద్ జేసిండన్నా”
“నీ యవ్వ! నా పేరు జెప్పి సేటు కాడ తీస్కో పోరా!” అని ఒర్రే సరికి బయిటికి ఉరికిండు పిలగాడు.

“ఏం తాతా! సోడా నా ? ఆన్ ద రాక్స్ ఆఆ?” అనుకుంట రెండు గ్లాసులల్ల చిటికెనేలు మునిగేటంత మందు పోసి మిగిలింది సోడా నింపిండు. ఉంగురం ఏలు ఓ గ్లాసుల ముంచి రెండు సుక్కలు కింద సల్లి సగం గ్లాసు ఒక్క గుటుకల ఎత్తేసిండు. ఇంతల మల్ల ఫోన్ మోగబట్టింది.., మందు పడే సరికి గొంతుల గరళం కిందికి జారిందో ఏమో, ఈ సారి ఫోన్ ఎత్తి “ఏంది!” అన్నడు రుబాబుగ.
అవుతలి నుంచి “పది రోజులైంది, పత్తకు లేకుంట పోయినవేందిరా… కనీసం ఫోన్ అన్న ఎత్తవు?” అనుకుంట ఓ పెద్ద మనిషి గొంతు
“నా తోని ఏం పని నీకు… ఓ! నడుపుకుంట అంటివి గద… నడుపుకో” అని అలిగిన పోరని తీర మూతి ముడిసిండు.
“నువ్వు లేక పోతె సగం మంది రెగ్యులర్ కస్టమర్లు ఎనుకకు పోతున్నర్రా… వేరే ప్రెస్సులకు కంపోజింగ్‌కి పోతె వాల్ల సేటులు ఊకుంటలేరు. రాత్రికి రాత్రి కంపోజర్ ని ఏడ బట్టుక రావాలెరా?”
“నీ ప్రెస్! నీ ఇష్టం.. నన్ను అడుగుతవేంది?” అని మేన మామ అని గూడ సూడకుంట కసురుకున్నడు.
“కనీసం ఏడ ఉన్నవో అదన్న జెప్పురా?”
“ఆ ఏట్ల ఉన్న!” అనుకుంట సెల్ కట్ జేసిండు శీను.

* * *

“I had two divorces … then I thought I better keep it separate that’s why I only have girl friend now” అని గ్రెగ్ అనంగనే
“అహ!” అనుకుంట లోపలికి తలకాయ తిప్పుకున్నడు రమేశ్
“by grace of god I’m a great grand father now!”
“WOW!” అన్నడు రమేశ్
“Yes! And I give all my attention to her… my great grand daughter”
“…and my daughter & my grand daughter are mad at me now, because now I give all my attention to ALIA, my great grand daughter”

మామూలుగ తొమ్మిది గంట్లకు లేసి ఆఫీసుకు పోవుడే కష్టమయ్యేది, ఇప్పుడు ఏడు గంట్ల ఫ్లైట్ పట్టుకోనీకి మూడు గంట్లకు లేశి ఏర్‌పోర్ట్‌కు పోవాల్సి వచ్చినందుకు తన ఖర్మను తిట్టుకోవాల్నో? వినేటోడు వింటున్నడా లేదా అనె సోయి గూడ లేకుంట లొడ లొడా మాట్లాడి నిద్ర చెడగొట్టే డ్రైవర్ దొరికినందుకు తిట్టుకోవాల్నో అర్థం కాలేదు జరసేపు రమేశ్ కి.

* * *

అప్పటికే ఓ పావుశేరు మందు బడ్డది, బండి పటాల మీద ఎక్కుడే కాదు దౌడు పెట్ట బట్టింది, ఇంతల శీను వాల్ల మావ మల్ల ఫోన్ జేసిండు
“అరే ఇప్పుడే గదనయ్యా ఫోన్ చెయ్యకు అని జెప్పిన, మల్ల జేస్తివేంది?” అని చిరాకు బడ్డడు శీను
“అరే శీను! నా మాట ఇనురా! నువ్వు అడిగినదానికంటె ఎక్కువ మొత్తం మూడు వేయిలకు పెంచుత జీతం సరేనా ?! ఏడ ఉన్నా సరె గంటల ప్రెస్ ల ఉండాలె?”
“ఆ ఘంట! ఏం జేస్కోనీకి? ఓ మూడు వేలకు పెంచుతడంట సావుకారి!”
“అరే పాపం దేశ్పాండే సారు ఇప్పటికి ఓ నాలుగు సార్ల వచ్చి పోయిండంట రా నిన్నటి సంది, నే దెగ్గర తప్పితె వేరె దెగ్గర కంపోజ్ చేయించుకోను అంటున్నడు రా? ఇంక చాన మంది వాపస్ పోతున్రు రా?”
“సరే మంచిది ఉంట” అని ఫోన్ కట్ జేయ బోయిండు “అరే ఏం గావాల్నో చెప్పుర? ఇట్ల దందా ఖరాబు జెయ్యకుర?”
“దందా ఖరాబు జేసింది నువ్వా? నేనా? ఓ సంవత్సరం కింద అసలు ఇక్కడో ప్రెస్సుగూడ ఉంటదని తెల్వదు జనాలకు, అసొంటిది వరంగల్ల నెంబర్ వన్ … ఎంత? నెంబర్ వన్! ప్లేస్ కు తీసుకొచ్చినంక, ‘నేను జేసింది ఏమి లేదు, నా ప్రెస్సు నేనెట్ల నడుపుకోవాల్నో నాకు తెలుసంటావు’?” అని ఫోన్ పెట్టేసి మిగిలిన పావి సేరు దిక్కు ఒక సూపు సూశిండు.

* * *

“గ్యానీ! అరె ఓ గ్యాని!” అనుకుంట అరుస్తుంటె ఆగిండు జ్నానేశ్వర్. తండ్రి తాపి పని జేసుకుంటడు, తల్లి తెల్లారిగట్ల మూడు గంట్లకు బుట్ట ఎత్తుకొని మార్కట్ల కూరగాయలు నింపుకొని నాలుగు వాడలు తిరిగి మద్యానం కల్ల ఇంట్లబడి, చీకటి పడే దాంక మిగిలిన కూరగాయలు అమ్ముకుంట కూసుంటది. పేదరికంల వాల్లు సదువుకోలేక ఏం పొడగొట్టుకున్నరో తెలుసు గనుక, ఉన్న ఒక్కగానొక్క కొడుకును పెద్ద సదువులు సదివియ్యాలని, వాన్ని చిన్నప్పటిసంది గల్లీల ఉన్న ఇంగ్లీషు మీడియం స్కూల్ల ఏసింరు.

స్కూల్ల ఏశినప్పుడు గ్యాని తోటోల్ల కంటె ఓక సంవత్సరం చిన్నోడు, బడి గూడ కొత్తది. మన గ్యానిగాడు పెరుగుతున్న కొద్ది బడి పెరిగింది, దాని ఫీజులు పెరిగినయి.

“అరే గ్యాని! ఏంరా పిలుస్తుంటె హౌలె గాని లెక్క అట్ల దిక్కులు జూస్తున్నవేందిరా?” అనుకుంట ఎనుక నుంచి వచ్చి మీద చెయ్యి ఏశిండు సచిన్.

సచిన్ గాని అయ్య గూడ సదువుకోలే, గని పెద్ద క్రికెట్ పిచ్చోడు. మనోడు పుట్టినప్పుడు, అదే టైంల సచిన్ టెండుల్కర్ సెంచరీ కొట్టి వన్డే మ్యాచ్ గెలిపిచ్చిండట. ఖతం ఇంటి పేరుతో సహ “సచిన్ టెండుల్కర్” అని పేరు పెట్టింరు వానికి.

“నిన్నటి నుంచి సూస్తున్న రోడ్ల మీద చక్కర్లు కొడుతున్నవు ఏందిరా స్కూలుకు పోకుంట?”
“ఇప్పుడు స్కూల్ లేదురా, ప్రి-ఫైనల్ ఎక్జామ్స్ అని ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చింరు”
“మరి ఇంట్ల కూసొని సదువుకోక హౌలె గాని లెక్క ఎందుకు తిరుగుతున్నవు బే?”
“ఏం లేదురా! నేను ఇంటికి పోతున్న మల్ల మాట్లాడుత”
“ఏం రా? అంత ఫోజు కొడుతున్నవ్?” అనే సరికి
“లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి ఫీజ్ కట్టలేదని అట్లనే పబ్లిక్ ఎక్జామ్ కి కూడ ఫీజ్ కట్టలేదని స్కూలుకు రావొద్దు పొమ్మన్నరు”

“నీయమ్మ! గిదీనికే గిట్లై పోయినవారా? మర్చిపోయినవా నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంక బతికి ఉన్నడని? ఎంత గావాలె, ఇంగో?” అని సీక్రెట్ పాకెట్ ల చెయ్యి బెట్టి ఐదువందల రూపాయల నోటు ఇచ్చిండు
“నాకు 395 రుపీస్ చాలురా!”
“అరే ఉండనీ బే తర్వాత ఇద్దువుగని” అని జేబుల పెట్టిండు
“మల్ల ఇంట్ల ఏం జెప్తవ్ రా?”
“డోంట్ వర్రీ దోస్త్ ! ఇది నా పాకెట్ మనీ ల నుంచి ఇచ్చినలే… ఆల్ ద బెస్ట్ రా మరి ఎక్జామ్స్ కి” అనుకుంట పక్క గల్లీలకు మాయమయ్యిండు సచిన్.

* * *

మిగిలిన పావు సేరు గూడ అయిపోయినంక బిల్లు గట్టనీకి లేశిండు శీను. “తాతా! ఫిర్ మిలేంగె” అనుకుంట జేబుల నుంచి ఐదు వందల నోటు ఇడిపిచ్చిండు. బిల్లుగడుతుంటె పని పిలగాడు అట్లనే నిలబడి సూస్తున్నడు శీను దిక్కు “ఏం రా! బల్లి గుడ్లేసుకొని అట్ల జూస్తున్నవ్ ? టిప్ కావాల్నారా?” అనుకుంట రెండు రూపాయల బిల్ల పిలగానికి ఇచ్చి “ఐష్ కర్ !” అనుకుంట బండి వంచిండు శీను.

* * *

సచిన్ ఇచ్చిన ఐదు వందల నోటును అట్లనే పిడికిట్ల బిగించుకొని, నడుస్తున్న రోడ్డు ఎక్కడ మొదలు అయితదో కనుక్కుందామని అన్నట్టు నడువబట్టిండు గ్యాని. జరసేపటికి పిక్కలు గుంజ బట్టినయి. పోతున్న కొద్ది రోడ్డు ఎత్తు పెరుక్కుంట ఒక బ్రిడ్జి కాడ ఆగింది. బ్రిడ్జ్ పిట్టగోడ మీద, మోచేతులు ఆసరగ నిలబడ్డడు. సచిన్ ఇచ్చిన ఐదు వందల నోటును ముందుకు ఎనుకకు తిప్పుకుంట సూస్తున్నడు. నోటు తిప్పుతున్న కొద్ది తల్కాయిల ఏవేవో ఆలోచనలు తిరుగుతున్నయి.

“చేతుల ఉన్న ఐదొందలు తీస్కపోయి ఫీజు కట్టి పరీక్ష రాయాల్నా? సచిన్ సంవత్సరం కిందనే బడి బందుబెట్టి పెట్రోల్ పంపుల పనిజేసుకుంట వాల్ల నాయినకు ఆసరగ ఉంటున్నడు, వాడు సదువు ఆపినా గాని నేను ఇంకా సదువుకోవాలని వానికి మనసుల ఉన్నది… ఇప్పుడు ఏదో ఫీజు కట్టి పరీక్షలు రాసినా మల్ల పది పాస్ కావాలంటె ఇంక మూడేల్లు సదువాలె …
… వాటి ఫీజులకు మల్ల ఇంట్ల అమ్మ నాయినను సతాయించాలె. ఈ ఐదొందలు ఇంట్ల ఇచ్చి సచిన్ తోటి పెట్రోల్ బంక్ ల పని జెయ్యాల్నా? స్కూల్ ఫస్ట్ వస్తె మిగిలిన సదువుకు ఫీజ్ మాఫ్ చేస్తమన్నరు… సదువుకోవాల్నా మల్ల?”

* * *

“When it was the time for my daughter I gave her all my attention, then to my grand daughter and now to my great grand daughter… she is my life you know?”
ఇంతలనే టర్మినల్ దగ్గరికి వచ్చుడుతోటి ఒక్క సారి రమేశ్ హమ్మయ్య అనుకుంట కిందికి దిగిండు.
“Well! You have a Merry Christmas ! a safe and a very happy holidays sir!” అనుకుంట గ్రెగ్ డిక్కీల నుంచి సూట్‌కేసులు తీశి బయిట పెట్టిండు.
“Happy holidays to you too!” అనుకుంట రమేశ్ పది డాలర్లు పట్టుకొని గ్రెగ్ చెయ్యి కలిపిండు.
“Thank you sir! You have a great holidays” అని తుర్రున మాయమయిండు గ్రెగ.

* * *

 గ్యాని గాని మెదడుల చిన్నపాటి మిక్సీ నడుస్తాంది. ఈ పరధ్యానంల చేతుల ఉన్న ఐదొందల నోటు ఎప్పుడు జారిపోయిందో తెల్వలే. బ్రిడ్జి కిందికి వాలిపోయే ముందు, నోటు మీదున్న గాంధీ తాత గ్యానిని చూసి ఎందుకు నవ్వుతుండో వానికి అర్థం కాలే?
గొంతుల ఏదో తెలువని నొప్పి… కడుపుల ఏదో ఎలితి !

ఇంతల ఓ చేతక్ మీద పోతున్న మనిషి బండి రోడ్డు పక్కకు ఆపి స్టాండు ఏసుడు కనబడ్డది. ఆ పెద్దమనిషి ఐదొండల నోటిను పట్టుకొని ముందుకు ఎనుకకు సూస్తున్న్నడు, ఎవరు కనబడక పొయ్యేసరికి చేతక్ తీసుకొని ఎల్లి పోయిండు.

పై నుంచి గ్యాని గొంతు పగిలేటట్టు ఒర్రుతున్నడు. వాని కేక గొంతుకి పెదుములకి మద్యనే మూగవొయ్యింది.

* * *

(12/27/2008)


Responses

 1. great narration.
  I confess .. not at my brightest right now .. but what’s the connection between Ramesh’s US story and Jnani/Seenu’s story in India??

 2. They are disconnected events!

  We are acquainted to traditional story telling in a three act structure with an introduction, body & a climax, with connected events.

  In ‘Gati’ I don’t intentionally try to break that format, but try to join 3 disconnected events with a monetary value of (approximately) $10. What $10 may be of value in three different perspectives, at the same time trying to show different human values.

 3. I have enjoyed the story for the ease in language and narration as such. but, I do I agree with kotha pali. Narration is really great. yet response from kotha paali is valid.
  incidents are not entirely disconnected. story of Gyani and Seenu is connected, but that of Ramesh is not to any of the other two.
  differing perspectives underlined by Rs 500/$1o doesn’t occur to reader’s mind. There should have been some mechanism in the story structure itself to make it suggestive to to the reader .
  Reader would still remain wondering even after JP’s explicit suggestion (in response to kotha paali). Actually it should have been implicit in the story itself.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: