Posted by: JayaPrakash Telangana | March 8, 2007

జీవితం : విధా? లేక యాదృచ్ఛికమా?

“Is life a well oiled machine where everything’s programmed? When one has to come to life, when one has to lose? Or are these mere coincidences, about which we don’t think of, unless something dire happens?”

నేను ఈ పోస్ట్ రాసుడు… దాన్ని మీరు సదువుడు, అది కూడ ఇప్పుడు… సరిగ్గ ఈ టైంకే సదువుడు… విధా? లేక యాదృచ్ఛికమా? ఈ ప్రశ్న చాన పెద్ద మూల్యం చెల్లించినంక గాని నాకు తట్టలే?

* * *

(వరంగల్, ఆదివారం, 18 ఫిబ్రవరి 2007, భారత కాలమానం బట్టి రాత్రి దాదాపు 10:55 గంట్లకు)

“ఈ పల్సర్ కొని ఐదేల్లయిన కాలే… అప్పుడె పరేశాన్ చేస్తుంది”
అనుకుంట కింద పడ్డ బండి లేపనీకి కోషిశ్ చేస్తుండు వెంకట్. వెంకట్రామ టాకీస్ దాటంగనే చీకట్ల ఏదో రాయి అడ్డమొచ్చి పడ్డడు.
“సాయింత్రం దావత్ కాడ కొంచం ఎక్కువ అయిందా ఏంది… ఎహే! తాగిన నాలుగు పెగ్గులకే ఏంది ఎక్కేది… జయగాడు నేను కల్సి ఫుల్ బాటిల్‌లు లేపిన రోజుల్లేవా?” అనుకుంట బండిని గట్టిగ ఎత్తిండు. మోచెయ్యికి దెబ్బ తాకినప్పుడు తెల్వలే, కని ఇప్పుడు బండి ఎత్తినప్పుడు సలిపినట్టు అయ్యింది (చిన్నప్పుడు జామచెట్టు మీది నుంచి పడ్డప్పుడు ఇరిగిన చెయ్యి).

*

“రేయ్ నర్సింగ్! తిండి తినవ్‌రా? ఖార్‌ఖాన అయినంక సక్కగ ఇంటికి రాక ఊరంత తిర్గొస్తవ్… రాంగనే మల్ల ఈ దరిద్రపు సిన్మాలు సూస్కుంట టీవి ముందట కూసుంటవ్?” నర్సింగ్ వాల్ల అమ్మ. “నీ యవ్వ! తింట జరాగే లొల్లిబెట్టకు” అని మల్ల టీవిల మొకం బెట్టిండు. నా వంతు అయిపోయిందని లోపలికి పొయ్యి బీడీలు చేసుకుంట కూసున్నది వాల్లమ్మ.

అప్పుడే పట్నంకి (హైద్రాబాద్) ఒక ట్రిప్ ఏసి ఒచ్చి అన్నం పెట్టుకొని తినుకుంట “పెల్లిల్ల సీజన్ శురూ అయితె అసలు మెస్లనియ్యరు గద” అని ములుక్కుంటుండు బాబు. వెంకట్ ఈ మద్యనే ఒక టాటా సూమో కొన్నడు పెల్లిల్లకు తిప్పనీకి, ఒకిద్దరు డ్రైవర్లు మారినంక బాబును పెట్టుకున్నడు నమ్మకం కుదిరినంక.

*

విజయ్‌కి షరీఫ్ ఆర్ట్స్ కాలేజిల దోస్తు, మొన్ననే దుబై నుంచి ఒచ్చిండు. చాన రోజులకు కలిసినం గద అని హంటర్ రోడ్ మీదున్న ధాబాకు గుంజుక పోయిండు షరీఫ్‌ని. ఫుడ్ ఆర్డర్ చేస్తుంటె “లూస్ కంట్రోల్… నాన నాన నానా… నాన నాన నానా… లూస్ కంట్రోల్!” అనుకుంట విజయ్ సెల్ మొత్తుకుంటుంది ఎత్తంగనే అవుతల వెంకట్…
“ఏడున్నవ్ బే!”
“కలింగల రా! షరీఫ్‌గాడు దొర్కిండు… కూసున్నం!”
“అబే సాలే! జరాగరాదుర నేనుగూడ ఒస్తున్న?”
“నువ్వెడున్నవ్ బే!”
“బండి స్కిడ్ అయ్యిందిరా వెంకట్రామ టాకీస్ కాడ, గేర్‌బాక్స్ దొబ్బినట్టున్నది స్టార్ట్ అయితలేదు, మా కాక వాల్లింటికి నూక్కపోతున్న. నేనో గంటల మల్ల ఫోన్ జేస్త ఆడనే ఉండండి” అని ఫోన్ పెట్టేసిండు వెంకట్.

*

మెదక్ అవుతల అడివిల నుంచి కలప తీస్కొని, కమలాపూర్ ఏ.పి రేయాన్స్ ప్లాంట్ కు బయల్దేరిన సాయిలు, భోనగిరి చేరంగనే ఒక హోటల్ దెగ్గర లారీ ఆపి క్లీనర్ దిక్కు చూసి “అరే చిన్నా! జప్పున కానియ్‌రా, మర్లొచ్చెటప్పుడు ఇంకో లోడ్ ఏసుకొని వచ్చేదున్నది… తెల్లారేకల్ల ఇంట్ల బడాలె. మీ వదినను తిస్కరానీకి మల్ల పుట్టింటికి పోయేదున్నది” అని
“అరే చొటె! పానీ లారె!” అన్నడు వేటర్ దిక్కు చూసుకుంట.

*

కంట్ల ఎండబడే సరికి నిద్రలేసిన, టైం (అమెరికాల) జూస్తె పన్నెండున్నర దగ్గర బడ్తున్నది. టీ.విల ఏదో సూస్కుంట రాత్రి రెండు మూడు అయ్యింది పండుకునేసరికి. మాకు వీకెండులు ఒస్తె ఇంతె.

* * *

(18 ఫిబ్రవరి 2007, భారత కాలమానం బట్టి రాత్రి దాదాపు 11:35 గంట్లకు)

వెంకట్రామ టాకీస్ కాడి నుంచి కాక వాల్ల ఇల్లు ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటదేమో. బండి తోసుకుంట కాక వాల్ల ఇంటికి చేరే సరికి వెంకట్ చెమటతోటి తడిసిపోయిండు. అరుగు మీద కూసొని పక్కింటోల్లతోటి ముచ్చట చెప్పుకుంట కూసున్న కాక వెంకట్‌ని సూడంగనే పరెషాన్ అయ్యిండు. “ఏంది బిడ్డా ఏమైంది, మొకమంత గట్ల కొట్టుకపోయింది, ఆ నెత్తురేంది?” అనుకుంట దగ్గెరికొచ్చిండు. అంత దూరం బండి నెట్టుకుంట వస్తుంటె కారేది చెమటా నెత్తురా పట్టిచ్చికోలేదు మనోడు.
“ఏం లేదు కాకా! బండి సతాయిస్తుంది పొద్దట్నుంచి. ఈడ పెట్టిపోదామనొచ్చిన రేపొచ్చి పట్టుకపోత”
అని బండి చెట్టుకింద పెట్టి ఆడ్నుంచి ఎల్లిపోతుంటె
“అరే! చెమ్టలు కారబట్టే అట్లనే పోతవు.. జరసేపు ఫ్యాన్ కిందనన్న కూసో పో” అంటుంటెనే.. “రేపొస్త కాక!” అనుకుంట బైట పడ్తుంటె ఇంతల్నే సెల్ మోగింది “ఆ అన్నయ్య! ఆ… ఈడనే ఉన్న ఎం.జి.యం కాడ… ఇప్పుడే పది నిమ్షాలల్ల ఒస్త… ఆ… సరె…” అని ఫోన్ పెట్టేసిండు వెంకట్‌.

*

“ఓరి నర్సింగ్! పెరుగు లేక పోతె తిండి తిననంటవ్, జల్దిన పొయ్యి ఓ సౌ గ్రామ్ అందుకరా పోరా. లేక పోతె మార్వడోడు మల్ల దుకునం మూసుకుంటడు?” అన్నది నర్సింగ్ వాల్ల అమ్మ బీడీల మూతులు ఒత్తుకుంట.
“నీ యవ్వ! పర్షాన్ జేస్తవేందే” అని ఇసురుకుంట బైటికొచ్చిండు అంగి ఏసుకుంట.

పొద్దున్నే లేసి ఇంకో పెల్లికి సూమో తీస్కపోయేదున్నదని బాబు అన్నం తిని అట్ల ఒరిగిండో లేదో ఫోన్ మోగింది
“బాబు! నేను భయ్! వెంకట్!”
“ఆ సార్! చెప్పుండి. ఇప్పుడే హైద్రాబాద్ నుంచొచ్చి అట్ల తిని…” పండుకున్న అనే లోపే
“నా బండి ఖరాబైంది, నేను రామన్నపేట్‌ల ఉన్న సూమో తీస్కొని జల్దిరా నన్ను ఇంట్ల దింపి పోదూవుగని”
“సార్! రేపు మబ్బులనే ఇంకో పెల్లికి పోవాలె తెల్సుగద…”
“అరే, దస్ మినెట్ భయ్ బతిలాడాల్నా నిన్నిప్పుడు… రామన్నపేట్‌ల మా కాక వాల్ల ఇల్లు తెల్సు గద, సరె సిద్దయ్య హోటల్‌కి రా ఆడుంట” అని ఇంకో మాట ఇనకుంట ఫోన్ పెట్టేసిండు.
“నీ యవ్వ! లేట్‌గ పోవొద్దంటడు, నిద్రపోకపోతె టైం కి ఎట్లబోతరు…” అని గొనుక్కుంట సూమో తీసిండు.

*

“ఏం రా షరీఫ్! దుబై పోయినప్పటి నుంచి మందు తాగలేదని నిన్ను ఈడికి పట్టుకొస్తె, నువ్వేందిరా సుక్కల దిక్కు సూస్తున్నవ్” అని ఖాలీ అయిన ఒక హాఫ్ బాటిల్‌ని బేరర్‌కి సూపించుకుంట “ఔర్ ఏక్ హాఫ్ బేజో భయ్!” అన్నడు విజయ్.

*

“అరే ఏమైందిరా నీయవ్వ! ఇంకెప్పుడు తెస్తవ్‌రా మటన్ కర్రీ, నా మిండడు సచ్చినంకనా?” అని హోటల్‌ల లొల్లి మొదలుపెట్టిండు సాయిలు “అరే చిన్నా! పక్క పాన్ డబ్బాలకు పొయ్యి ఒక చిన్న గోల్డ్‌ఫ్లేక్ డబ్బ పట్కరాపోరా” అని ఒక ఇర్వై రూపాల నోటిచ్చిండు. “అన్నా నేనొక పాన్ ఏయించుకుంటనే” అన్నడు చిన్నా, ఇంక మీసాలుగూడ రాని మూతి తుడుసుకుంట.
“భాడ్కవ్! పాన్ గావల్ బే నీకు…” అనుకుంట తన్నిండు పరాష్కంగ,
“స్వీట్ పానే గద…” అని గునుక్కుంట పొయ్యిండు.

*

ప్రతీ ఆదివారం ఎంత తొందరగ లెవ్వాలన్నా గిట్లనే లేసుడైతుంది, ఇట్లైతె ఎట్ల అనుకుంట మొకం కడుక్కోని పాలల్ల ఇన్ని కార్న్‌ఫ్లేక్‌లు ఏసుకొని టీ.వీ ముందు కూసున్న. ఇయ్యాల ఏం చేసేదున్నదీ అనుకుంట చానెల్లు తిప్పుతుంటె యాదికొచ్చింది., ఒచ్చే వారం చేద్దాం… ఒచ్చే వారం చేద్దాం… అనుకుంటనే మూడు పొయ్యి ఆరు లోడ్‌లు అయినయి బట్టలు, ఇయ్యాల ఎట్లన్నజేసి అవ్వి పిండుకోవాలె అని డిసైడ్ జేసిన.

* * *

(18 ఫిబ్రవరి 2007, భారత కాలమానం బట్టి రాత్రి దాదాపు 11:55 గంట్లకు)

బాబును సూమో తీస్కరమ్మని ఫోన్ పెట్టెయ్యంగనే, సందు తిరుక్కుంట నర్సింగ్ కనిపిచ్చిండు వెంకట్‌కి “ఏం పటేలా! పండుకోలే ఇంక ?… అబ్భీచ్ ఆయేంగె చల్” అనుకుంట సిద్దయ్య హోటల్‌కి పట్టుకపొయ్యి చెరో సిగిరెట్ ఎలిగిచిన్రు.
“మల్ల ఏడ పడ్డవ్ రా, మొకమంత అట్ల కొట్టుకపోయింది” అన్నడు నర్సింగ్.
“బండి మల్ల సతాయిస్తుంది రా, మొన్ననే సర్వీసింగ్‌కి ఇచ్చిన”… అనుకుంట పక్కనే ఉన్న అద్దంల మొకం చూస్కొని “ఓర్నీ ఘోరంగ కొటుకపొయ్యింది గదరా భయ్, ఇయ్యల ఇంట్ల ఉన్నయి పో నాకు” అని బయిటికి సూసేసరికి బాబు సూమో పార్క్ జేస్తుండు.
“రా రా పోదాం” అనుకుంట నర్సింగ్ కు సైగ చేసిండు. ఇప్పుడు ఏడికి రా అన్నట్టు సూడంగనే
“అబ్భీ దస్ మినెట్ మే ఆయేంగే చల్!” అని సూమోల కూసుంట “బాబు, మన హంటర్ రోడ్ మీద కలింగ ధాబ ఉంది చూడు, అక్కడ ఒక్క ఐదు నిమ్షాలు ఆగి పోదాం” అన్నడు వెంకట్.

*

“నీ యమ్మ! ఇంకో సారి ఈ హోటల్‌ల తినొద్దురా” అనుకుంట చిన్నా దిక్కు సూసి అన్నడు సాయిలు. లారీ స్టార్ట్ చేసుకుంట ఏదో గుర్తొచ్చి “రేడియేటర్‌ల నీల్లు పొయ్యమన్న పోశినవారా?” అనంగనే మర్శిపోయిన అన్నట్టు నెత్తి గోక్కుంటున్న చిన్నగాని నెత్తి మీద ఒక దెబ్బపడ్డది. ఇంకా ముదరని తల్కాయాయె గూబ గుయ్యిమన్నది. తల్కాయి పట్టుకొని దిగి బకిట్ తీశిండు నీల్లకు.

*

మొత్తానికి బట్టల మూటలన్ని కార్ల ఏసుకొని లాండ్రీల బడ్డ. రోజుకోసారి బట్టలు ఉతుక్కునుడుకంటె నెలకోసారి ఉతుక్కునుడే బాగున్నదనే ఆలోచన పాతబడ్డది, నెలకోసారిగూడ పిండుకోవాలంటె బద్దకమైతుంది అనుకుంట బట్టలు వాషింగ్‌మిషిన్‌ల పడేశి టైం సూస్కున్న.

* * *

(19 ఫిబ్రవరి 2007, భారత కాలమానం బట్టి రాత్రి దాదాపు 01:05 గంట్లకు)

“మాక్కీ కిర్‌కిరీ! గిన్నేల్లకు కల్శిండని నేనొచ్చి తాగుతుంటె వీడేంది ఉత్తగ కూసుంటడు, నీయమ్మ తాగు బే షరీఫ్” అనుకుంట బలవంత పెడుతుండు వెంకట్.
ఇంతల్నే బాబు ఒచ్చి “సార్! పొద్దున్నే ఇంకో పెల్లుంది…” జల్ది పోదాం అన్నట్టు మొకం పెట్టిండు.
“ఇట్ల కాదు గని ఈనికి గూడ జరింత పొయ్యింరి రా” అని ఎవరో అనే సరికి, బాబు బైటికి నడిసిండు.
ఇంతల్నే ఏదో ఫోన్ ఒస్తె మాట్లాడి, నడురా పోదాం అన్నడు అందర్ని ఉద్దేశించి వెంకట్. బిల్లుగట్టి బైటికొచ్చిన్రు.
“షరీఫ్! ఆ బే గాడీ మే చోడ్ దేతు!” అని కొత్తగ కొన్న సూమో దిక్కు సూపిచ్చిండు వెంకట్
“లేదురా బండి తీస్కొచ్చిన…” అనుకుంట పాత చేతక్ స్టార్ట్ చేస్కొని చీకట్లకు మాయమయ్యిండు షరీఫ్.
“బాబు! పర్కాల్‌ల నిన్నటి బారాతోల్లు ఉన్నరట, ఒక ట్రిప్ గొట్టి ఇంట్లబడ్దాం” ఒక్కటే అన్నట్టు వంకర్లు తిరిగున్న సూపుడు ఏలు ఎత్తు సూపిచ్చిండు.
“లేదు సార్, తకాయించిపోయిన హైద్రాబాద్‌కు చక్కర్లు గొట్టి గొట్టి… నేను పండుకుంట మీరే నడుపుకోండ్లి” అన్నడు బాబు ఇంకా ఓపికలేక.
“అరే విజయ్ తూ చలాతా రే!” అనుకుంట సూమో తాలాలు ఇసిరిండు.
“అబ్బే దేడ్‌ బజ్‌రా రే, మై జాతౌ…” అన్న నర్సింగ్‌ని “అరే పోదూవ్ తియ్యి పటేలా, మేం రాత్రంత రోడ్లు ఊడ్సుకుంట కూసుంటమా ఏమన్న” అనుకుంట కారీబాగ్‌ల కొన్ని పార్సల్లు, ఇంకో మందు సీసా ఏసుకొని, నర్సింగ్ బుజంమీద ఇంకో చెయ్యేసి తీస్కపొయ్యి డ్రైవర్ సీట్ ఏనుక కూసున్నడు.

*

లారీ జనగాము దాటింది, తెల్లరేకల్ల ఇంట్లబడ్తమా లేదా అని ఆలోచించుకుంట ఒక సిగిరెట్ ఎలిగించు కుంటున్నడు సాయిలు, ఇంతల్నే యాడినుంచి ఒచ్చిందో ఒక బర్రె రోడ్డుకడ్డం నడుస్తాంది. జర్రయితె గుద్దేటోడే. అమావాస చీకట్ల ఈ కర్రె బర్రె అడ్డమొచ్చుడు సరిపోయింది అనుకుంట లారీ కొంచం స్లో జేసిండు. చెర్లు ఎండుకపొయ్యి, చేసుకోనికీ పనుల్లేక, మేత ఎయ్యలేక బర్లను ఊరిమీదికి ఒదిలితె అవ్వి ఇట్ల రోడ్ల మీద పడి మన్షుల పానాలమీదికి తెస్తున్నయి.

*

బట్టలు అన్ని వాషర్‌లనుంచి తీసి డ్రయ్యర్‌ల పడేసి ఇంటికొచ్చిన. ఇంకో గంటసేపు ఆగి పొయ్యి బట్టలు తెచ్చుకోవాలె మల్ల మర్శిపోతనేమో అని అలారం పెట్టుకోని మల్ల టీ.వి ముందట కూసున్న.

* * *

(19 ఫిబ్రవరి 2007, భారత కాలమానం బట్టి తెల్లారిగట్ల దాదాపు 02:15 గంట్లకు)

పర్కాల్ పొయ్యి పెల్లోల్లను తీస్కొచ్చి శాయంపేటల దించి, ఇంకొక్క ట్రిప్పు కొడ్తె అయిపోతదని మల్ల పర్కాల దిక్కు సూమో తిప్పిన్రు. విజయ్ సూమో తోలుతుంటె, పక్క సీట్‌ల పండుకున్నడు బాబు.
విజయ్ ఎనుక కూసొని వెంకట్, నర్సింగ్ ఇద్దరు హన్మకొండ బస్‌స్టాండ్‌ల కొనుక్కున్న మిర్పకాయ బజ్జీలు తినుకుంట ఏదో ముచ్చట చెప్పుకుంటున్నరు.

*

అలారం మోగింది. బద్దకంగ లేశిన, ఆరిన బట్టలు తెచ్చుకోనీకి. అట్లనే ఏమన్న ఉత్తరాలొచ్చినయో సూడాలె, నాలుగు రోజులనుంచి మేయిల్ బాక్స్ మొకంగూడ సూడలే అనుకుంట లేశిన.

* * *

(19 ఫిబ్రవరి 2007, భారత కాలమానం బట్టి తెల్లారిగట్ల దాదాపు 02:27 గంట్లకు)

సూమో ములుగు రోడ్డు మలుపు తిరిగింది. ఎప్పుడు జాతర లెక్క ఉండే రోడ్డు ఖాలీగున్నది. ఇంకో రెండు గంటలైతే మల్ల జనం ఒచ్చుడు మొదలైతది. ఆరెపల్లి దెగ్గరికి చేరుకుంటున్నం అనంగ కట్టెలేసుకొని ఒక లారీ పోతుంది ముందట. సింగిల్ లేన్‌హైవే అయ్యేసరికి ఇంక ఓపిక లేక లారీని ఓవర్‌టేక్ చేస్తుండు విజయ్. లారీ నడుపుతున్న సాయిలు ఓ అయిదు నిమ్షాల నుంచి ఆ సూమోను గమనిస్తనే ఉన్నడు. పూర్తిగ ఓవర్‌టేక్ చెయ్యకముందే సూమో రోడ్డుకు ఎడుమ దిక్కుకు ఒచ్చి లారీని గుద్దింది. పెద్దగ సప్పుడయ్యే సరికి ఏమయిందో అర్థమయ్యి దబ్బున బ్రేక్ తొక్కిండు సాయిలు.

* * *

సరిగ్గ ఆరెపల్లి దెగ్గర అయ్యప్పగుడి ముందట లారీని సూమో గుద్దుకున్నది. ఆ దెబ్బకి సూమో టాప్ ఎగిరిపొయ్యింది. అదే దెబ్బ ఎనుక సీట్‌ల ఉన్న వెంకట్, నర్సింగ్ ఇద్దరిని గాలిలకు ఇసిరేశింది. వెంకట్, నర్సింగ్ ఇద్దరు స్పాట్‌ల చనిపోయిన్రు. సూమో లారీకి రెండు ఫర్లాంగుల దూరంల రోడ్డుదిగి ఆగి ఉన్నది.

*

ఏదో బుక్ పోస్ట్ వస్తే తెరుద్దామని కవర్‌ను చింపుతుంటె, ఏలు కోసుకుంది.
ఇదేం ఇచ్ఛెంత్రం అనుకున్న!

* * *

(గమనిక) 18 ఫిబ్రవరి 2007, రాత్రి దాదాపు పదకొండు గంట్లకు వెంకట్ బండి ఖరాబ్ అవ్వుడు, తెల్లారిగట్ల దాదాపు రెండున్నర గంట్లకు ఆక్సిడెంట్‌ల వెంకట్, నర్సింగ్‌లు చనిపోవుడు మాత్రమే వాస్తవాలు. మిగిలినయి అన్నీ ఆ నాలుగు గంటల్ల అక్కడక్కడ విన్న సంఘటనల ఆధారంగ నేను చేసిన ఊహాగానాలే, నా కల్పనలే. వెంకట్ నాకు అన్నకన్నా (పెద్దమ్మ కొడుకు, నాకంటె ఒక సంవస్రం పెద్ద) దోస్తుగ నాకు చాన దగ్గర. మంచి అయినా చెడ్డ అయినా కలిసి చేసినం… ముప్పై ఏల్ల మా బంధం ఒక్క చిటికెల మాయమయింది.Venkat Devulapalli

ఈ పోస్ట్ “ what if’s ” & “ but’s ” తోటే రాసుడు అయ్యింది. సరిగ్గ ఆ టైంల ఆ సూమో, ఆ లారీ అక్కడ ఉన్నందుకే ఆ ఆక్సిడెంట్, అయ్యింది. అది విధా? లేక యాదృచ్ఛికమా? ఆ ‘chain of events’ ఎక్కడో ఒక్కదెగ్గర తెగి ఉంటె ఆ ఆక్సిడెంట్ జరిగి ఉండేదా.

 • పల్సర్ మీది నుంచి పడంగనే బండి కాక వాల్ల ఇంట్ల పెట్టి, వెంకట్ ఇంటికి పొయ్యి ఉంటె…
 • కాక చెప్పిన మాట విని వెంకట్‌ కొంచం సేపు ఫాన్ కింద కూసొని ఉంటె…
 • వెంకట్‌కి అసలు నర్సింగ్ ఎదురు పడి ఉండకపోతె…
 • వెంకట్ ఫోన్ చేసి సూమో తీస్కొని రమ్మని అన్నప్పుడు, బాబు అసలు హైద్రాబాద్ నుంచి తిరిగి రాక పొయ్యి ఉంటె…
 • తిరిగి వచ్చినా వెంకట్‌ ఫోన్ చేశే సరికి బాబు పండుకొని ఉంటె…
 • ఆర్డర్ చెయ్యంగనే ‘మటన్ కర్రీ’ ఆలస్యం కాకుండా వచ్చి, అనుకున్న టైం కంటె ముందు సాయిలు అక్కడి నుంచి బయలుదేరి ఉంటె…
 • చెప్పంగనే చిన్నా రేడీయేటర్‌ల నీల్లు పోశి ఉంటె, అనుకున్న టైం కంటె ఒక పది నిమ్షాలు ముందు సాయిలు అక్కడి నుంచి బయలుదేరి ఉంటె…
 • జనగాము దెగ్గర రోడ్డుకు అడ్డమొచ్చిన బర్రెను సాయిలు గుద్ది, అక్కడ ఆలస్యం అయ్యి ఉంటె…
 • అసలు షరీఫ్ దుబై నుంచి తిరిగి రాకుంటె… ఒచ్చినా విజయ్‌కి కల్వకపొయ్యి ఉంటె…
 • పెరుగు కోసం నర్సింగ్‌ను వాల్లమ్మ బయిటికి తోలి ఉండకపోతె…
 • “… అబ్భీచ్ ఆయేంగె చల్”, “అబ్భీ దస్ మినెట్ మే ఆయేంగే చల్!” అని వెంకట్ అడిగినప్పుడల్ల అందరు ‘నేను రాను నువ్వు పోరా భయ్’ అని అని ఉంటె…
 • అసలు సూమో నే కొనకపొయ్యి ఉంటె…
 • ఎవ్వరూ మందు తాగకుంట ఉండి ఉంటె…

… వెంకట్, నర్సింగ్‌లు ఇప్పుడు బతికి ఉండెటోల్లా ? అది విధా? లేక యాదృచ్ఛికమా?

Small Request:
Don’t Drink! If you do Please Don’t Drive!
Also don’t forget “Seat Belts Save Lives!”

(10:55 pm 03.07.07)

Graphic Image, take caution

Graphic Image, take caution while opening it

* * *

Glossary :

దావత్ : ఫంక్షన్, విందు
ఖార్‌ఖాన : ఇండస్ట్రి, పని, ఉద్యోగం,
శురూ అయితె : మొదలు అయితె
మెస్లనియ్యరు : ఊపిరితీసుకోనివ్వరు
కాక : బాబాయి
జప్పున : తొందరగ
వీకెండులు : శని, ఆదివారాలు
పర్షాన్ : పరేశాన్, ఇబ్బంది, చికాకు
మిండడు: భర్త, మొగుడు
లొల్లి: గొడవ, గలాబా
పరాష్కంగ: నవ్వులాటగ
సందు: వీధి
అబ్భీచ్: ఇప్పుడే
జల్ది: తొందరగ
తకాయించిపోయి: అలిసిపోయి
దేడ్‌ బజ్‌రా: ఒకటిన్నర అవుతుంది
జరింత: కొంచం
జర్రయితె: కొంచమయితె
తోలుతుంటె : నడుపుతుంటె
ఇచ్ఛెంత్రం: విచిత్రం


Responses

 1. FYI :

  (the pictures are graphic, viewer discretion advised)

  … one thing i didn’t understand is, why they mis-reported that ‘ …the sumo hit a parked DCM… ‘, when the eye witnesses said that both the vehicles were in motion when the accident happened.

 2. Bagundira… nee rayadam……kaani antha rasaka katha lo vuundi mee anna ani thelisinka baleduara….edo bada anipisthundi…..
  kaani edi eppudu ela jaragalo ala jaruguthundi..daaniki evvaru karanam kaaru ….ade devuni maya anukunta nenu…….

  Nothing like Wrong time and Wrong place — just fate……… that’s life……….we have to swallow what ever god gives us.

 3. Life is ruthless, మనకు బాగున్నా లేకున్న తీసుకపోయేటోడికి second chance ఇయ్యదు కద? i wish it had !

  That’s whats the BIG QUESTION i had on my mind while i was writing this, whether it was fate that was playing, or was it “Being at the wrong place, at the wrong time” ?

 4. నేను యాదృచ్చికమనే నమ్ముతాను. ఒక ప్రమాదం జరిగింది అంటే జరిగింది మీరన్న ఎన్నో వాటిల్లో ఏ ఒక్కటి జరిగున్నా ప్రమాదం జరగక పోవును..అలా అనుకోవడం జరిగిన తర్వాత మన అంచనా అంతే! అది అర్థం లేనిది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. left me speechless!

 6. నా ఉద్దేశంల విధి అనేది చాలా ప్రమాదకరమైన మాట. ప్రమాదకరమైన కాన్సెప్ట్. ఎందుకంటే ఒక విషయాన్ని విధి అనుకున్నమంటే అన్నీ విధే అవుతయి కదా! కట్నం కోసం భర్త చేత భార్య తగులబెట్టబడడం ఆమె విధి, ఒక పసి పాపపై అత్యాచారం చేయబడితే అది ఆ పాప విధి, ఒక మంత్రి ఒక కుంభకోణం ల బాధ్యుడయితే అది ప్రజల విధి, ఇరాకీ ప్రజలు అమెరికా చేత బాంబ్ చేయబడితే అది వాళ్ల విధి. విధి అనే దాంట్ల ఎట్లాంటి తప్పులు, ఒప్పులు ఉండవు ఎందుకంటే అది విధి కదా, విధి అంటేనే అదివరకే నిర్ణయించబడినట్లు కదా (predetermined)! ఇక తప్పులు, ఒప్పులు లేనప్పుడు ఒకరిని శిక్షించడం అనేది ఉండొద్దు. ఎవరు చేసిన దానికి వాళ్లు కారణం కాదు, విధే కారణం కదా! విధి ని నమ్మినప్పుడు, ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడం కూడా దండగే! ఒకోసారి విధి అనుకోవడం వల్ల మనిషికి కొంత బాధ తగ్గడమో లేదా ఆందోళన తగ్గడమో జరుగొచ్చు. కాని ఇంకోవైపు నుండి ఆలోచించినప్పుడు విధి అనేది మనిషి ప్రయత్నానికి అడ్డంకిగా పనిచేస్తది. మనిషిని అణిగిమణిగి ఉండేటట్లు చేస్తది. మనిషి చేసే దౌర్జన్యాలను తప్పుగా కాక ఒక విధిగా సర్దిచెప్పుకునే అవకాశాన్ని ఇస్తది. ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే యూరోప్ నుండి అమెరికాకి వలస వచ్చిన యురోపియన్లు అమెరికాల వున్న మూలవాసులను చంపుతూ, వాళ్లు పుట్టి పెరిగిన భూముల నుండి తరిమేసి వాటిని ఆక్రమించుకుంటూ దానిని ‘మానిస్ఫెస్ట్ డెస్టినీ’ (Manifest Destiny) గా అభివర్ణించింరు. అంటే నేటివ్ అమెరికన్లను తరిమేస్తూ వాళ్ల భూముల్ని ఆక్రమించుకోవడం ఒక ‘స్పష్టమైన విధి’గా వాళ్లు చెప్పుకున్నరు.

  వెంకట్ చనిపోయిన ఉదంతం తీసుకుంటే దానికి యాదృచ్ఛికతతో పాటు కారణాలు కూడా లేకపోలేదు. తాగి డ్రైవ్ చేయడం అనేది ఆక్సిడెంట్స్ అయ్యే రిస్క్ ని చాలా పెంచుతుంది. ఎంత రిస్క్ పెరుగుతుందనేదాని గురించి పరిశోధనలు కూడా చాలానే జరిగినయి. American Transportation Research Board ప్రకారం: ‘For drivers with alcohol concentrations above 0.15% on weekend nights, the likelihood of being killed in a single-vehicle crash is more than 380 times higher than it is for non-drinking drivers.’ ఆ హై రిస్క్ బిహేవియర్ వెంకట్ కి గాని ఆ సుమోల వున్న ఇతరులకి గాని ఎట్లా, ఎందుకు అలవడిందనడానికి కూడా ఇంటి పరిస్థితులు, చుట్టూ ఉన్న సమాజాన్ని వెతికితే కనబడకపోవు.

  ఒకోసారి ఎట్లాంటి హై రిస్క్ బిహేవియర్ లేని వాళ్లకి ఇతరుల వల్ల ప్రమాదం వాటిల్లుతుంది. ఒకోసారి ఎవరి ప్రమేయం లేకుండానే కేవలం యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు జరగవచ్చు (సంతోషకరమైనవైనా, బాధాకరమైనవైనా!). ఎంత యాదృచ్ఛికం అనిపించినా మనకి తెలిసినవో, తెలియనివో కారణాలు ఉండనే ఉంటయి. అందుల అనుభవించేవాళ్లది తప్పో, ఒప్పో ఉండొచ్చు, ఉండకపోవచ్చు.

  అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా ఒకోసారి కొన్ని సంఘటనలు విధి లాగానో, లేదా కారణం లేనిదాని లాగానో అనిపించొచ్చు. కాని ఒక విషయాన్ని విధి అనుకుంటే అన్నీ విధే అనుకోవలసి వస్తది. విధి అని ఊర్కుంటే ప్రపంచంల తప్పు, ఒప్పు, ప్రయత్నం, మార్పు అనేవి ఉండవు. వెంకట్ ఉదంతం తీసుకుంటే దాన్ని విధి అనుకుంటే మన అలోచన ప్రవాహం అక్కడితో ఆగిపోవలసిందే! అదే కారణాలు వెతికితే నలుగురికీ తాగొద్దని చెప్పాలనిపించొచ్చు, తాగి డ్రైవ్ చేయడం వల్ల వచ్చే అనర్థాల గురించి నలుగురికీ చాటిచెప్పే ఒక వెబ్ సైట్ పెట్టవచ్చు, ఒక campaign మొదలుపెట్టొచ్చు, అసలు ఈ హై రిస్క్ బిహేవియర్ కి మూలకారణాలు ఏంటి అని తెలుసుకోడానికి ఏదన్నా పరిశోధన చేయాలనిపించవచ్చు, ఇట్లా ఆలోచిస్తూ పోతే possibilities are endless!

 7. This post is really good, more over it is moving since it relates to the writer’s personal experience. I felt heavy with sorrow after reading the whole thing.

  Well, coming to the point – I believe in coincidence. According to my understanding – there is nothing static in this world, every thing is moving. It is the position of matter in space always moving with certain speed in the framework of time that determines the happenings of events. But again it cannot be thus said mechanically – what about the matter called brain?

  Human brain is the highest form of matter. What about its dynamics? Sure, it is conditioned by the physical society around it.But what is its speed or velocity and how can we position it or determine its position in a specific framework? We can arbitrarily deterimine the postions of all objects in the universe depending on their mass and velocity. But the human brain is what becomes complex. We can say there will definitely be a lunar eclipse or solar eclipse at a certain pre-determined time but we cannot say one person will definitely do this at a certain point of time – it could change based on several physical determinable factors but what makes it more and more complex and indeterminable is the human brain. If you read the book ‘Brief History of Time’ by Stefan Hawking you will for sure be convinced by two things –

  One : God (if he existed – we can call that fate too) does not play a game of dice and

  Two : Irrespective of his presence the universe has its own set rules and laws which it will obey within the stochastic framework and domain stipualted by matter, space and time. Well, movement of matter in space is time or time is matter’s motion in space.

  Now into this framework of theoretical physics bring in the human brain(s) (and thus the human society, people, values, culture,economy, politics, literature, technology – the whole gambit surrounding Human beings) and try and pre-determine the happenings of events? Can we? Is it meta-physical or still does it belong to the realm of physics (science)? I do not believe it is metaphysical but there certainly is an aspect of uncertainity, chaos, stochasticism – not the same (or may be same?) as the stochastic or chaotic behavior of Universe that always eludes us and we tend to call it fate!!! But I try to understand it in the context of and with relevance to the fifth dimension – 3 dimenisions of space, 1 time dimenstion and the other the dimension of brain – I am not sure if we can call it a specific dimension because itself is again determined by the other four dimensions. Because it is so complex and undeterminable we tend to call it fate – but it definitely is not.

  Once again to reiterate ‘it is not chance (game of dice) or fate’ – it can be determined but yet cannot determined (or I should say highly impossible to be determined) and we are still very far away from travelling in time ! It is similar to the concept – the Universe is finite but yet infinite.

 8. విషాదంలోంచి పుట్టిన ఈ జాబు చదివాక మనసు దేవినట్టైంది. జరిగిన ప్రతీ ఘటనా ఆ ప్రమాదానికి దారి తీసినట్లుగా అనిపించినా.. ప్రతీదీ అలాంటిదే కాకపోవచ్చు! అయితే కొన్ని మాత్రం..

  ఒక సంఘటన.. మాఊరికి దగ్గర పొన్నూరు ఉంది. అక్కడికి కేవలం 25 కి.మీ. దూరంలో బాపట్ల దగ్గర సముద్రం ఉంది. కానీ బాపట్ల కాదనుకుని కొంతమంది పొన్నూరు నుండి దాదాపు 100 కి.మీ. దూరంలోని కృష్ణాజిల్లా బందరు -సముద్రస్నానానికని – వెళ్ళారు. సరిగ్గా వాళ్ళు స్నానం చేసేటపుడే సునామి వచ్చి, వాళ్ళను చుట్టేసుకుపోయింది. ఎక్కడో పొన్నూరులోని వాళ్ళు, సరిగ్గా అదేరోజుకు ఎవరో పిలిచినట్లు సునామీకి ఎదురెళ్ళడం.. విధి అనే అనిపించింది నాకు. అది విన్న మా పిన్ని నాకో సామెత చెప్పింది.. “తల పడే చోటికి కాళ్ళు నడిచి వెళ్తాయట”అని.

 9. నా ఆధ్యాత్మిక మిత్రుడు ఒకసారి incidents అనేవి ఉంటాయి కానీ, accidents అనేవి ఉండవు అని అన్నాడు. చాలా బాధ కలిగించిన సంఘటన, వారి ఆత్మకు శాంతి కలుగు గాక.

 10. avunu itlaney anipistadhi. wishful thinking to avert painful events. okasaari gaadhu chaala saarlu anipistadhi.
  rationale mind ki answer dhorakochu. peddha kashtam kaadhu. kaani nijaanni bharinchadamu rationale tho veelugaadhu. appuditlaney anipistadhi. abaddhamey nijamayite baaguntadhanipistadhi. manusunu maro vidhangaa nachacheppalenapudu

  facts remain as merciless pointers.
  the appeal is more important. let no friend of ours think of doing great things after drinks. nothing is lost if one rests thoroughly on becoming spiritual

 11. very interesting especially the way a story is made out of personal pain.
  there is nothing like vidhi. As Chaithanya says, vidhi, as concept plays havoc with people’s lives. But, spontainity is there.
  Several forces act on a ‘point’ and make the ‘point’ move. Its the total effedct of the forces tha makes the point move in a certain manner and in certain direction. Thing is, we don’t know all the forces that act on the point. We take only those forces that we see and make judgements and inferences. Thus, I think, science limits itself and language too. Better not to be absolutionists even in the case of super- natural. I think it is enough to accept the fact that we do not know all the forces and work with those that we know, while trying to know the rest.
  Thus, yes, we should have seat belts and we should avoid driving after drinking etc rather than leaving things to fate. We know such precautins do help in minimizing chances of getting hurt or killed.
  Becoming too ‘spiritual’, especially in the back- ground of personal tragedies like losing a friend or beloved would lead us into the hands of fatalism, which is bound to render us passive and even submissive in the face of injustices. Fatalism is a tool for exploitation by the ruthless.
  Once again I congradilate the writer of this story. ‘Literature’, as tool for sharing feelings, has lot of soothing effect not only to those who read but also to those who write. That is why every person msut be reader and writer too.
  Hrk

 12. I feel sorry for the accident but i take it as total irresponsibility of those youth’s towards their personal life and towards their family. Taking alcohol and roaming late nights has become a fashion among youths. My relative kids who are just into engineering studies are doing same inspite of telling them good things but moreover they are totally spoiled by the Films with bad culture imposed on them. Those friends could have decently met in the morning and gave that Dubai friend a good homely-meal at home, ‘Amma chethi Vanta’ and spend time with families together and spend some more personal time with the Dubai friend in the village whole day without alcohol…

 13. http://www.samanyashastram.org/BabuRao_new.pdf

 14. I totally agree with you Archana & my point is the same, the more the youth leans towards ‘Risky Behavior’ it takes them a step closer to their doom


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: