Posted by: JayaPrakash Telangana | May 26, 2013

రాజిగ వొరి రాజిగ !

– జయప్రకాశ్ తెలంగాణ

(Short Link to share http://bit.ly/rajigaa)
Optimism

“ఠం ఁఁఁఁఁ గ్”!
ఇత్తడి సర్వ బండ మీద పడ్డసప్పుడుకు మెల్క ఒచ్చింది నర్సవ్వకు.
ఎప్పుడు మొదటిజాములనే లేశి పనులల్ల బడేది, కని పానం ఇదివరకటోలిగె లేదు. ఆ ఊరు లెక్కనే బక్క జిక్కి, సొప్ప బెండోలె ఈడుస్క పోయింది నర్సమ్మ పానం. ఊరు అన్నారం, కరీంనగర్బస్టాండ్‌కు ఒక పది పదకొండు మైల్లు ఉంటదేమో. కరువు, కరెంటు కోత ఆ ఊరును సగం తింటె మిగిలింది, గ్రనైట్రాళ్ళ కోసం

గుట్టలను పేల్సుడుతోటి నాశనం పట్టిచ్చిన్రు. ఆ బాంబుల పేళుల్లకు ఊర్ల చీర్కలు వాయని గోడలు లేవు, బాగు పడ్డ బతుకులు లేవు … ఆ ఊల్లె సర్పంచి, వాల్ల సుట్టాలు తప్ప.
“ఏందిరా అయ్యా! చీకట్లనే లేశినవు, పానం కులాసేనా?”
అనుకుంట బాయికాడికి చేరుకోని, నీల్లు చేదుకుంటున్న మనువన్ని అడిగింది. నోట్ల యాప పుల్లఏసుకొని నీల్లు చేదుకుంట తల్కాయ ఊపిండు, అంత పైలమే అన్నట్టు.
“ఈయ్యాల్నన్న ఇంత సద్ది గట్టాల్నా బిడ్డ?”
అని రందితోటి అడిగింది నర్సమ్మ. మారు మాట్లాడకుంట పోయి గోలెంల నీల్లు నింప్పి రెండు చెంబులు పోసుకోని గుడిశెలకు ఉరికిండు రాజెందర్. నెత్తి గోక్కుంట కడుపల్నే కూసున్నది ముసల్ది, అటు సూశి ఇటు సూశే లోపల్నే సైకల్ ఏసుకొని గంట కొట్టుకుంట మలుపు తిరిగి మాయమయ్యిండు మనువడు.

* * *

రోడ్డుకు అడ్డం నడుస్తున్న బర్లనుతప్పిచ్చుకోని పోతుంటె
“వోర్రార్రా… ర్రాజిగ”!
అని చాయిదుకునం కాడి నుంచి ఎవరో పిలిశినట్టు ఇనపడ్డా ఏమి ఏర్పడనట్టు రయ్యిమని తొక్కుకుంట పోతున్నడు. బాటెంబటి ఎవ్వలు ఏర్పాటు జేసినా పట్టిచ్చుకోకుంట వాల్ల నాయినోలిగెనే ఆయిన తొక్కిన హీరొ సైకిల్ తొక్కుకుంట చెరువు కట్ట ఎక్కిండు.

ఒక ఫర్లాంగ్పోయినంక చెట్టు కింద సైకిల్ స్టాండ్ ఏసి, దానికున్న గాలాలు అందుకొని, సంచిసంకకు ఏసుకొని చెరువు దిక్కు ఉరికి పోయి ఒడ్డుకున్న ఒక గుండుమీద కూసోని, సంచిల ఉన్న సీసాల నుంచి ఎర్రల్ని దీసి గాలాలకు కుచ్చి చెర్లకుఇసిరి ఒక దమ్ము తీసుకున్నడు.

ఆకారాలు మారిన గుట్టల సందులల్ల నుంచి మెల్లగ సూరీడుపైకి లేస్తుంటె, సంచిల ఉన్న ముంజ కాయలు తీసి తినుకుంట గాలాల దిక్కు సూస్తున్నడు. దినం మొత్తంల ఎప్పుడు ఉండనంత శాంతంగ ఇప్పుడు ఉంటది మన రాజన్న మొకం. ఒక గాలం కదిలినట్టు అయితె బయిటికి గుంజిండు, ఎర్ర పోయింది కని చేప పడలేదు, మల్లో ఎర్ర ఏస్తుంటె ఎనుక నుంచిఏదో బండి సప్పుడైంది.

నిమ్మలంగ ఉన్నచెరువుల రాయి పడంగనే లేసిన అలల లెక్క, రాజన్న మొకంల ఒక రెప్పపాటున్న సంబురం పోయింది. తల్కాయ తిప్పి సూడక పోయినా ఎవలొస్తున్నరో తెలుసు కాబట్టి కోపానికి పండ్లు బిగవట్టి కిందికి సూడవట్టిండు.

“ఏంరా రాజిగా, ఇయ్యాల పొద్దుగాల్నే వచ్చినట్టున్నవ్? ఏమన్నపడ్డయా? ఫికర్ జెయ్యకు నేనుఏసుకొస్త తియ్యి నీ వంతుయి గూడ” అనుకుంట రాజన్నను దాటి చెరువుకు ఇంకో దిక్కుపోయిండు సీను.
ఎండ నెత్తిమీదికి వచ్చింది, కడుపుల కలకలమనవట్టింది. సంచిల నుంచి ఇన్ని పుట్నాలుతీసుకొని నోట్ల పోసుకున్నడు. ఇంతల్నే ఏదో పేలుడు ఇనవడ్డది, రాజన్న కాల్లకింది మట్టి ఒక్కసారి అదిరింది. ఆ సప్పుడుకి కండ్లు, చెవులు మూసుకోని, కూసున్న జాగల్నే శిగమొచ్చినట్టు ఊగబట్టిండు.

ఊరి పక్కెంబడిఉన్న గ్రనైట్ మైనుల పేల్చే బాంబులు కొన్ని ఆడ పనిజేసే సుట్టం తోటితెప్పిచ్చుకొని, వాట్ని చెర్ల పేల్చి పట్టిన చేపల్ని కరీంనగర్ బస్టాండ్‌దెగ్గర పడ్డ కొత్త ఫయివ్ స్టార్ హోటలోనికి అమ్ముతడు సీను. ఇది రాజన్నకు పురాగ గిట్టది. ఇదివరకుటోలిగె గాలం ఏస్తె చిక్కుతలేవు చేపలు. బాంబుల సప్పుల్లకు బెదిరి ఎక్కడ్నో దొర్కకుంట దాగుంటున్నయి. జర సేపటికి సంచి సగం నింపుకొని సీను ఇటు మొకాన రావట్టిండు. రాజన్న తలకాయ తిప్పకుంట చెర్ల గాలాల దిక్కే సూడ వట్టిండు.

“ఏంరా రాజిగ, సంచి ఖాలిగ కానొస్తుంది ఇంకేం పడలే?”
రాజన్న మొకం ఎర్రగ కావట్టింది
“ఇంగో పటు” అని సంచిల్నుంచి రెండు చేపలు రాజన్న దిక్కు ఇసిరిండు
కట్టలు తెంచుకున్న కోపం తోటి ఆచేపల్ని ఏరి ఒకటి సీను దిక్కు ఇసిరి ఇంకోటి చెర్ల ఇసిరిండు రాజన్న. ఇదేం పట్టనట్టు
“ఆ… బామ్మర్దీ! మస్తు పడ్డయి ఇయ్యాల, అరగంటల వస్తనని చెప్పు మీ సేటుకు…” అనుకుంటసెల్ ఫోన్ల మాట్లాడుకుంట స్కూటర్ ఎక్కి పోయిండు సీను.

ఎండిపోయిన చెరువోలె ఉన్న రాజన్న కండ్లు, గాలాలదిక్కు అట్లనే సూసుకుంట కూసున్నయి.

* * *

చేపలు పడకపోయినా ఏం అనిపియ్యది గానిసీనుగాడు చేపలు ఇసిరేసినప్పుడల్లా పుండుమీద కారం సల్లినట్టైతది.

సైకిల్ ఏసుకొని బాట ఎంబడి పోతుంటెదారి పొడుగూత నడుస్తున్న గౌన్లోల్లకు రాజుగాన్ని సూస్తె వాళ్ళ నాయిన నర్సన్నకానొస్తడు.

సైకిల్ చెట్టుకు ఒరిగిచ్చి చాయిదుకునంలకు వచ్చి కూసున్నడు.

“ఏంరా వారీ, ఏమన్న తిన్నావ్ర ఇయ్యాల? ఏం తింటవు? పూరీనా, డబల్ రొట్టెనా?” అనుకుంట ఒక గిలాసల నీల్లు తెచ్చిండు రవి. రాజిగాడు తల్కాయ ఎత్తక పోయేపటికి “ఒక డబల్రొట్టె తియ్యవే” అనుకుంట సీస గిలాసల చాయ్ పోయవట్టిండు. పుక్యానికి మేపుతడు వీన్ని అన్న కోపంతోటి రవిపెండ్లాం సలసల మనుకుంట ఒక డబల్ రొట్టె ఆడ పడేసిపోయింది. మీదికి సూడకుంటఅట్లనే డబల్ రొట్టెను చాయ్‌ల ముంచుకోని తిన్నడు. తినుడు అయిపోయినంక పోతున్నఅని సూత చెప్పకుంట సైకిల్ ఏసుకొని మాయమయ్యిండు.

“ఏమయ్యో నీకు సుట్టమా పక్కమా? ఎందుకు మేపుతవు రోజు వాన్ని?” అనుకుంట రవిని కసురుకున్నదిశాంతమ్మ. “ఎహే నీయవ్వ! ఎప్పుడు సూడు వాని మీదనే ఏడుస్తవ్!” అనుకుంట లోపలికి పోయిండు.

రాజిగాడు కొంచంముందటికి పోంగనే చెరువు కట్టెంబడి ఒక కొబ్బరి కాయ కానొస్తే తీసి సంచిల ఏసుకున్నడు, ఎనుక నుంచి ఓ పెద్దమనిషి పిలిశినట్టు ఇనబడ్డది, ఇనిపిచ్చుకోనట్టు సైకిలేసుకోని మాయమయ్యిండు.

పిలిశింది సైదులు, రాజిగాని తాతకు దూరపు సుట్టం. సొసంత్ర సమరయోధుల పించన్ తోటి కాల్లీడుస్తున్నడు.

* * *

అయ్యగార్లన్న ఇయ్యాలరేపు చీకట్లలేస్తరో లెవ్వరోగాని రాజిగాడు మాత్రం లేశి తయారైతుంటడు. తువ్వాల తీగమిద ఏశి, నిన్న దొరికిన కొబ్బరికాయ పొట్టు తీయబట్టిండుపొయ్యి పక్కకు పడున్న సీకు అందుకొని. పొట్టు తీస్తాంటె మనువని మొకంల కొడుకును సూసుకొని మురువబట్టిందినర్సవ్వ.

“ఒద్దురా వారీ !” అని ఏదో చెప్పుదాం అనుకునేటాల్లకే కొబ్బరి కాయ తోకను ఇరిశి సంచిల ఏసుకున్నడు.

“శీనయ్య నిన్న చేపలు ఇచ్చిండంట పెద్దవ్వకు, మనకు సూత రెండు ముక్కలు పెట్టింది, సలిబువ్వఏసుకోని రెండు బుక్కలు తినరాదు బిడ్డా!” అనంగనే కూసున్నోడు లేశి చిట చిటమనుకుంట పోయి బట్టలేసుకోబట్టిండు.

“సద్దన్న కట్టిస్తాగు బిడ్డా!” అనే లోపల్నే సైకిలేసుకొని మూల తిరిగిమాయమయ్యిండు రాజయ్య.

“ఏందే అవ్వా! నిన్న వచ్చిన కాంచి సూత్తున్న ఏమైంది ఈనికి?” అనుకుంట కాన్పుకు వచ్చిన పెద్దవ్వ బిడ్డ దుర్గ, నోట్ల బుర్ష్ ఏసుకుంట వచ్చి అడిగింది.

“ఏం చెప్పాలె బిడ్డా, కడుపు చింపుకుంటె కాల్ల మీద పడుతదన్నట్టు, వాళ్ళ నాయిన పురుగులమందు తాగి సచ్చినంక రాజయ్య సగం పిచ్చోడైండు, మొన్న సద్దులప్పుడు చిన్నోడు పట్నంల ఉరి పెట్టుకున్నప్పటి సంది పురాగ అయ్యిండు” అనుకుంట “వీడు సదువు బందు పెట్టి పట్నం నుంచి వచ్చి ఈడనేఉన్నడు ఆసర ఉంటది ఇంత అనుకుంటి. వీని అయ్య చెప్పక చేయక పాయె, వీడో గిట్ల అయిపాయె” అని ఏడ్వ బట్టింది.

“తిండి తినడు రోజుపొద్దుగూకేదాక చెరువు కట్ట మీద గాలమేసుకోని కూసుంటడు, చేపలు పట్టుకచ్చిన నాడే వండుక తింట, అప్పటి దాక నీసు ముట్టను అని ఇగో ఇట్లజిద్దుకు కూసున్నడు … నేనేం జేత్తు చెప్పు బిడ్డా ! వాల్ల అవ్వ పోరగాల్లమొకాలన్న సూడకుంట పాయె, అది బతికున్నా బాగుండు నాకీ తిప్పలు తప్పేటియి”

* * *

ఊర్ల ఇండ్లన్ని దాటిచెరువుకట్టను సూడంగనే పంజరం తలుపు తీశి ఉన్న చిల్క లెక్క అయితది రాజిగాని మొకం.

“అన్నా! ఇయ్యాల్నన్న రావ్వల్నా?” అని పాత సైకిల్ టైర్ ని కట్టెతోటి కొట్టుకుంట సైకిల్ఎంబడి ఉరుక బట్టిండు అబ్బయ్య, పది పదకొండేళ్ళు ఉంటయేమో. ‘రేపు’, అన్నట్టు సైగ చేసుకుంట ఎల్లిపోయిండు రాజిగాడు.

* * *

ఎప్పటి లెక్కనే గాలం ఏశి ఒక బండ మీద కూసున్నడు,సంచిల నుంచి కొబ్బరి కాయ తీశి పలగ్గొట్టుకొని తింటాంటె శీనయ్య అడుగుల సప్పుడుఇనచ్చింది “ఇంగోరా!” అని రెండు చేపలు రాజిగాని దిక్కు ఇసిరి ఎనుకకు సూత మర్రిసూడకుంట బండేసుకోని పోయిండు. రాజిగానికి ఇగ కోపం పట్టరాలె. చేపలను చెర్ల ఇసిరేశి,ఎంబడే గాలం సూత ఇసిరిండు. సైకిలేసుకొని కొంచం దూరం పోయినంక ఏమనుకున్నడో ఏందో మల్లఎనుకకొచ్చి గాలం కోసం దేవులాడబట్టిండు. మంచిగ బురుదల చిక్కుకోని ఎక్కిరిచ్చుకుంటసూడబట్టిందా గాలం. నీ ముందట నేను ఓడిపోయిన ఇంక అన్నట్టు తలకాయ దించుకోని గాలం అందుకోనిఇంటి దారి పట్టిండు రాజిగాడు.

* * *

బురుదబట్టిన కాళ్లు ఈడ్సుకుంట వచ్చి చాయ్ దుకానం ముందట బల్లమీద కూసునుడు సూశి రవి ఒక బకీట్‌ల నీల్లందుకొని ఒచ్చిండు “ఏడ బడ్డవ్‌రా మల్ల?” అనుకుంట నీల్లు పోయబట్టిండు. ఇంతలనే అటెటో పోతున్న సైదులుఈ యవ్వారం సూశి దుకాన్లకు వచ్చిండు. చేతిగర్ర బల్లకు ఆనిచ్చి రాజిగాని బుజం మీదచెయ్యేశి

“అవ్‌రా రాజిగ! నిన్న గంత గట్టిగ ఒర్రినా ఇనిపిచ్చుకోకుంటఉరికినవ్ ఏడికిరా? నాకే అనుకున్న నీకు సూత చెవ్వులు ఇనత్తలేవురా?” అని చెవ్వుల మిషిన్ సరిజేసుకుంట. రాజిగాడు ఏదో అందాం అనినోరు తెరువబోయిండు. “… కిష్టయ్య పోన్ జేశిండు, యూనివర్శిటీ నుంచి!ఏం జెప్పాలె?” అన్నడు

“కొత్తగ చెప్పేది ఏంలేదు” అన్నడు రాజిగాడు.

“ఆ! జర గట్టిగ జెప్పు బిడ్డా పురాగ ఇనత్తలేదు ఈ నడుమ”

“కొత్తగ చెప్పేదిఏమున్నది? ఎప్పటికి చెప్పేదే చెప్పు… వాపస్ ఒత్తలేనని!”

“నువ్వు జెప్పేదినువ్వు జెప్పు నేను జెప్పేది నేను జెప్తనే ఉంట” అన్నడు పెద్దాయన.

ఒక గిన్నెల అన్నం ఏసుకొచ్చి ముందట పెట్టిండు రవి,ఇంతల్నే శాంతవ్వ లోపలినుంచి సదువుడు శురూ జేశింది. “ఉన్న ఒక్కగానొక్క కొడుకు,జీనుపాంటు కొనియ్యమంటె మాత్రం పైసలు ఉండయి, ఊల్లందరికి మాత్రంపుక్యానికి మేపు, ఒచ్చిండయ్యా దర్మ రాజు” అని ఏదో అంటుంటె రవి ఆమె నోరు మూశిలోపటికి తోల్కపోయిండు. ఇదంత ఇని, తిందామని చెయ్యిపెట్టినోడు గిన్నెని పక్కకు నెట్టి లెవ్వబోయిండు.

సైదులు రాజిగాని చెయ్యి అందుకోని కూసోమ్మన్నట్టు సైగ చేసి“బిడ్డా! దేని మీద కోపం జేసుకున్నా నడుస్తది గని బువ్వ మీద నడువదురా! కూశొ” అని “శాంతవ్వసంగతి నీకు ఎరుకే గదరా, పైకి పల్లేరుగాయ లెక్క ఉన్నా మనసు ముంజకాయ,ఎన్నడు కడుపునిండ తిన్నవో తిను బిడ్డా” అనుకుంట రాజిగాని ఈపు నిమురబట్టిండు. ఒకపెద్దముద్ద నోట్ల పెట్టుకోని నవులుకుంట పెద్దాయిన కండ్లల్లకు సూశిండు. ఇద్దరికండ్లల్ల నీల్లు గింగిరాలు తిరుగుతున్నయి, ఇద్దరి కడుపుల నిండగోసనే. ఒకలిది కన్నోల్లను తోటోల్లను పొడగొట్టుకున్న గోస,ఇంకొకలిది కండ్ల ముందట మూడు తరాలు దుబ్బల కొట్టుకపోయింరు అన్న గోస. ఇద్దరు అట్లనేకూసున్నరు ఒక్క మాట సూత మాట్లాడకుంట.

* * *

ఎప్పటి కంటె ముందే ఇంటికి ఒచ్చిన మనువన్ని సూశి సంబురపడ్డది నర్సమ్మ.

“బిడ్డా! చెర్ల చేపలు ఒడిశినయని జెప్పిండురా శీనయ్య నిన్న?

ఇట్ల జిద్దు జెయ్యకురా?

ఒక బుక్క తిను. ఎన్ని దినాలని ఇట్ల ఉంటవు బిడ్డా,నాతోని అయితలేదురా నిన్ను ఇట్ల సూసుడు, రేపు సచ్చినంక మీఅవ్వ అయ్య కాడికి పోయినంక దానికి ఏమని జెప్పాలెబిడ్డా”

దగ్గరికి ఒచ్చి నర్సవ్వ చేతులను చేతులకు తీసుకొని “అవ్వానిన్ను ఈ వయసుల సాదాల్సింది పోయి ఇట్ల కష్టాలు పెడుతున్న ఏందే?”

“కాదా మరి? పెండ్లి జేసుకొనిజప్పున ఇద్దరు పిల్లలను కంటె సూశి పోదామనుకుంటె నువ్వేమో ఇట్ల జెయ్యబడితివి?” అనంగనే చిన్నగ నవ్విండు రాజిగాడు.

“నువ్వు అంత పెద్ద ప్లాన్లు ఎయ్యకు గని,వాపస్ ఒస్తుంటె శాంతవ్వ బువ్వబెట్టింది”

“అదా? ఎంగిలి చెయ్యి తోటికుక్కను సూత తోలది అది నీకు అన్నం బెట్టిందంటె నమ్మమంటావ్‌రా?”

“అయితె చెయ్యి వాసన సూడు” అనుకుంట ముసలిదాని ముక్కు దెగ్గరచెయ్యి ఆనిచ్చిండు.

“సరె ఈ పాలి నీ మాట ఇంట గాని, కూర ఓరకు బెడుతున్నరేపు పొద్దున తినకుంట బోయినవో నా మీద ఒట్టే! ఆ!” అనుకుంట ఆడి నుంచి దొడ్లెకుపోయింది నర్సవ్వ.

రాజిగాడు ఆడనే బల్ల మీద రెండు మెత్తలేసుకోని గోడ మీద ఉన్నఅమ్మ నాయిన తమ్ముని పోట్వాలను, మబ్బులల్ల సుక్కలనుసూశినట్టు సూసుకుంట అట్లనే నిద్రబోయిండు. రాజిగాని తమ్మునికి వీనికి పుట్టినప్పుడుపదమూడు నిమిషాలే తేడా, పద్నాలుగో నిమిషం ఆ తల్లికి విషమైంది. సూసుకుందాం అనుకుంటెతల్లి ఫోటో సూత లేకపాయె. మబ్బులల్ల చందమామను దేవులాడుకున్నట్టు దేవులాడుకుంటుంటడురాజిగాడు వాల్ల అమ్మను ఆ సుక్కల నడుమ.

* * *

పొద్దుగూకింది, రాజిగాడుఇంకాలెవ్వలేదు. చీకట్లనే లేశి పోయెటోడు ఇయ్యాల ఇంకా అట్లనే పండుకున్నడేందిఅన్నట్టు బల్ల మీద దుప్పట్ల సుట్టి ఉన్న ఆకారాన్ని సూసుకుంట అట్లనే నిలుసున్నరునోట్ల బురుశు ఏసుకోని పెద్దవ్వ బిడ్డ దుర్గ, నర్సవ్వ. ఇద్దరు గడియారం దిక్కు సూశింరు, చిన్నముల్లు ఎనిమిది మీదున్నది, పెద్ద ముల్లు పదమూడో నిమిషం మీదికి ఆనిందోలేదో అప్పుడే, గంపను తన్ని పైకి ఎగిరిన కోడిపుంజు లెక్కదుప్పటి తన్ని లేశి కూసున్నడు రాజిగాడు. ఇద్దరు జడుసుకున్నరు ఒకటే సారి.

రాజిగాని కండ్లెంబటి ధారలు పారుతున్నయి, ఏదో పీడ కలవడ్డట్టున్నది. జప్పున ఉరికి పోయి కండ్లల్లనీల్లు కడిగేద్దామన్నట్టు గోలెంల ముంచిండు తలకాయని. తీగ మీద తువాల ఉంటె గుంజుకోనిమొఖం తుడుసుకుంట అట్లనే బజార్లకు ఉరికిండు. ఇద్దరు అట్లనే సూసుకుంట ఉన్నరు జరంతసేపు, సైకల్ ఏసుకపోలే అంటె ఈడికే పోతున్నడువాపసొత్తడు అన్నట్టు ఊపిరి పీల్సింది నర్సవ్వ.

* * *

మొకం తుడుసుకుంట రవి చాయ్ దుకానం కాడికి పోతుంటె ఎప్పటికంటెజర ఎక్కువ జనమే కనబడ్డరు రాజిగానికి. ఓ ఇద్దరు ముగ్గురిని నెట్టేసుకుంట ముందుకుపోయే వరకు టీవీల వార్తలు వస్తున్నయి.

“తెలంగాణ కోసం డిల్లీలో రంగారెడ్డి జిల్లాకు చెందిన యాదిరెడ్డిఅనే వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుతెలియ వస్తుంది. సంఘటనా స్థలం వద్ద ఇరవై పేజీల సుసైడ్ నోట్ లభించింది అని పోలీసులుచెబుతున్నారు. ఉదయం ఏడున్నరకు ఎవరో ఫోన్ చేసి చెబితే వచ్చి చూసుకునే సరికి మరి, చెట్టుకు వేలాడుతున్న… ఒక ఫర్లాంగ్ దూరం లోనే మనకు పార్లమెంట్ బిల్డింగ్ కనిపిస్తుంది మీరు చూడవచ్చు… యాదిరెడ్డి అనే వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నట్టు మనకు తెలుస్తుంది రమాకాంత్ … పోలీసులు డెడ్ బాడీని రాం మనోహర్లోహియా ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం,మనం యాదిరెడ్డి ఉరివేసుకున్న చెట్టును ఇక్కడచూడ వచ్చు…” అనంగనే కెమెరామాన్ చెట్టు దిక్కు జూం చేస్తున్నడు. అది సూసుకుంట రాజిగాడు ఒక్కసారి అక్కడనే కుప్ప కూలి పోయిండు.ఎంత సేపు ఉన్నడో తెలువది అట్లనే గుంజకు ఆనుకొని కూసున్నడు,పరధ్యానంల ఎటో సూసుకుంట కూసున్నడు.

మంది పల్సబడుతున్నరు. వీడేంది ఇయ్యాల పొద్దుగాల్నే దిగిండుఅన్నట్టు సూస్తుంది శాంతవ్వ. మనసుల కలకలం, బరువెక్కినగుండెకాయను మోసుకుంట నడువబట్టిండు, కండ్లు సూస్తలేవుకాల్లు ఎటు మోసుకపోతె అటే అన్నట్టు పోతున్నడు. సర్కారు బడి దిక్కు నుంచి పోతుంటెమైక్‌ల తెలంగాణ పాటల రికార్డింగ్‌లు ఇనొస్తున్నయి, రేపు ఏదో మీటింగ్ ఉన్నట్టున్నది,బడిల డేరా ఏశి కుర్చీలు సదురుతున్నరు. బయిట స్కూటర్ మీద కూసోని ఎవరితోటోమాట్లాడుతున్నడు సీను. పక్కపొంటి పోతున్న రాజిగాన్ని సూశి “ఏం రా రాజిగా యాడికిరా?” అని బుజం మీద చెయ్యి ఎయ్యంగనే చెయ్యి తీశేశి ముందుకుపోయిండు. ఏమనుకున్నడో ఏందో ఎంబడే బండి స్టాండ్ ఏశి అడ్డం ఉరికచ్చి,“తమ్మీ! ఏందిరా ఎప్పుడు సూడు ఏందో పరాయోన్ని సూశినట్టు సూత్తవు?నేను ఏమన్నరా నిన్ను? ఏమన్న అవుసరం ఉంటె అడుగు, నీకంటె ఎక్కువనారా?”అన్నడు. నిస్సహాయంగ ఒక సూపు సూశి, బుజాల మీద ఏశినచేతులు తీసేశి, నీతోటి నాకేం లేదు అన్నట్టు ముందుకు పోయిండు రాజిగాడు.

జరంత దూరంల చింతచెట్టు నీడల నిలబడి,ఇదంత సూస్తున్నడు సైదులు తాత. ఓ పాలి ఇసుంట రార అన్నట్టు సైగ జేసిండు రాజిగాన్ని,ఇదంత ఏం పట్టనట్టు నేల సూపులు సూసుకుంట పోబట్టిండు. వీడు ఇనిపిచ్చుకుంట లేడుఅన్నది సమజై ముందటికి రాంగనే చేతిగర్ర కాల్ల నడుమ పెట్టంగనే బోర్లబొక్కల బడి ఈలోకంలకు వచ్చిండు రాజిగాడు.

“ఏంరా రాజిగా! ఇంత పరధ్యానం ఏందిరా?ఇంత మంది పోరగాళ్లు పిట్టల లెక్క రాలిపోతున్నరు, నువ్వేమో సోయి తప్పిఈడ మగ్గుతున్నవ్ !?”

“తాతా? ఏం జెయ్యల్నో సమజ్అయితలేదే నాకు? దమాఖ్ ఖరాబ్ అయితుంది!” అన్నడు రాజిగాడు దుబ్బ దులుపుకుంట.
“ఇన్నరా నేను సూత, కని ఇంకి పోయినయిరా!ఇప్పుడు ఏడుద్దామన్నా కండ్లెంబడి నీల్లత్తలేవురా!”

“నన్నేం జెయ్యమంటవే పోయి అడ్డం పడమంటవానే?”

“అడ్డమే పడుతవో తెడ్డమే పడుతవో గని ముందు ఈ ఊల్లె నుంచిఅవుతల బడు బిడ్డా” అని సూపుడు ఏలు నెత్తి దిక్కు సూపెట్టుకుంట “నలుగురు సాయితోల్ల తోటిఉంటె నీ గిర్ని మల్ల చాలయితదిరా. కిష్టయ్య తోటి ఒక పాలి మాట్లడు నువ్వైతె,పట్నం పోవుడు సంగతి తరువాత ఆలోచన జెయ్యొచ్చుగాని … ఎంతైనా నువ్వు ఈడ కంటె ఆడఉంటెనే ఎక్కువ అక్కరికి వత్తవ్ రా! జర నా మాట ఇను బిడ్డా!”

రాజిగాడు ఒకసారి నెత్తి గోక్కుంట అటు ఇటు సూశి,బడిల స్టేజీ దిక్కు జరంత సేపు జూసి ఇంటి దిక్కు తిరిగిండు. మైకుల “జబ్బకుసంచిచేతుల జెండా జాతర బోదమా…” అనుకుంట పాట నడుస్తున్నది.

* * *

యాప చెట్టు కింద మంచం ఏసుకొని నిండ దుప్పటి కప్పుకోనిపన్నడు రాజిగాడు.
“అన్నా!” అని అబ్బయ్య ఒర్రుకుంటఒచ్చే వరకు టక్కున లేశి కూసున్నడు.

అన్నా జల్ది నడువు, అన్నట్టు దమ్ము దీసుకుంట చెయ్యి పట్టుకోనిగుంజుతున్నడు అబ్బయ్య, కండ్లెంబడి నీల్లు గారుతున్నయి ఒకటే నీల్లుకారుతున్నయి. రాజిగాడు ఏం మాట్లాడకుంట లేశి అట్లనే ఉరికిండు పోరగాని తోటి మల్లఏమైతుందో సమజ్ కాక.

చాయ్ దుకునం దెగ్గరికి పోంగనే నిన్నటికంటెఎక్కువ జనం. యాది రెడ్డి ఫోటో ఒక దిక్కు కానొస్తుంది టీవీలఇంకో దిక్కు హరీష్ రావు శిగాలెత్తి దర్వాజలు కుర్చీలు తన్నుతున్నడు.

“… మంత్రి హరీష్ రావు ఏ.పీ భవన్లోకీ చొరబడిఒక వీధి రౌడీలా ప్రవర్తిస్తూ అధికారి పై చేయి చేసుకున్నారు … ఆ విజ్యువల్స్మీరిక్కడ చూడవచ్చు…” అని వస్తుంటే ఎవరో చానల్ మార్చి రాజ్ న్యూస్ పెట్టింరు “…ఏ.పీ భవన్ అధికారి రజత్ భార్గవ నిన్న పార్లమెంట్ దెగ్గర ఉరి వేసుకున్న యాది రెడ్డిశవాన్ని నేరుగా క్రిమెటోరియం పంపాలని జారీ చేసిన ఆదేశాలకు మండిపడి, యాది రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించడానికివెల్లిన హరీశ్ రావు ఏ.పీ భవన్ అధికారులను …” అని వస్తుండంగనే

“నీ యవ్వ! మా శవాలంటే గూడ ఇజ్జతి లేదారా ఈల్లకు!”అన్నరు ఎవరో మందిల నిలబడి.

అంతే రాజిగాడు అగ్గి మీద గుగ్గిలమై అటూ ఇటుసూడంగనే పక్కన గుంజకు ఒక గొడ్డలి ఆనిచ్చి కనబడ్డది, ఎంబడే అది అందుకొని ఉరుకబట్టిండు.

* * *

గుట్టల దెగ్గర తాళ్ల కింద గౌన్లోల్ల తోటి ముచ్చట బెట్టుకుంటఉన్నడు సైదులు. అప్పుడే దూరంగ ఎవరో ఉరుకుతున్నట్టు కనవడ్డరు.

“తాతా? వాడు మన రాజిగానిలెక్క కానోస్తుండు గదనే?” అని గౌన్‌లైనె అనంగనే తాత కట్టె అందుకొని అటు దిక్కునడువబట్టిండు.

రాజిగాడు అట్లనే ఉరుక్కుంట పోయి కనబడ్డ చెట్టుకు కనబడ్డట్టుకొమ్మలు కొట్టేయబట్టిండు. ఎనుకబడి ఉరికొచ్చిన అబ్బయ్య బయం బయంగనే ఒక పెద్ద బండరాయిసాటున నిలబడి ఒక గాలి దుమారాన్ని సూశినట్టు సూడబట్టిండు. జర సేపటికి తాత సూత వచ్చిబుజం మీదున్న తువాల తీశి చెముటలు తుడుసుకుంట ‘ఏమైందిరా’అన్నట్టు అబ్బయ్య బుజం తట్టిండు. కిందికి వంగమన్నట్టు సైగ జేసి ముసలాయన చెవ్వులఏదో చెప్పిండు.

రాజిగాడు పడుకుంట లేసుకుంట ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకుఉరుకబట్టిండు, కొమ్మలెనుక కొమ్మలు తెంచబట్టిండు. ఇంతల్నే ఊల్లె నుంచి రవిఇంకిద్దరు ఇటే ఉరికొచ్చింరు. సైదులు చేతిగర్ర అందియ్యంగనే అందుకొని రవి అట్లనేఉరికి పోయి కట్టె ఆసర జేసుకొని పోయి రాజిగాన్ని గట్టిగ కావలిచ్చుకోంగనే ఇద్దరు కిందపడ్డరు, ఇంకో ఇద్దరు రొచ్చి వాని జబ్బలు ఎనుకకు ఇరిశి దుబ్బలఅట్లనే అనుగబెట్టనీకి సూస్తున్నరు. రాజిగాడు కాల్లు ఇరిశిన ఎద్దులెక్క కింద బడికొట్టుకోబట్టిండు. జరసేపు అట్లనే అందరు కలియబడుతుంటె ఎర్రటి దుబ్బ తాళ్ళ ఎత్తుకులేస్తుంది.

దుబ్బలేసుడు ఆగంగనే, బండల సాటు నుంచిమెల్లగ తాత మనువల్లు ఇద్దరు ముందటికొచ్చింరు. ఇంగ వాన్నిఇడువుంరి అన్నట్టు తాతపోయి రవి బుజం తట్టంగనే రాజిగాని మీద వజన్ ఏశి ఉంచిన ముగ్గురు లేశింరు.

తాత పోయి రాజిగాని జుట్టుల చెయ్యి బెట్టి దువ్వినట్టుచెయ్యంగనే లేశి బోరున ఏడువబట్టిండు.

“రానియ్యి బిడ్డా! మొత్తం బయిటికి రానియ్యి …

ఎన్ని దినాలని ఇట్ల లోపల అడ్డ కట్ట ఏశి ఉంచుతవు?

… ఇట్ల ఎన్ని కొమ్మలని కొట్టేస్తవ్ బిడ్డా?… లే ” అనుకుంట రాజిగాని జబ్బలు పట్టుకోని లేపిండు.

అబ్బయ్య ఉరికిపోయి రవి బుజం మీద ఒక చెయ్యి ఏశి కుంటుకుంటనడుస్తున్న రాజిగాని చెయ్యి పట్టుకున్నడు, ఇంకో చెయ్యితోటిఎంబడె నడుస్తున్న తాత కట్టె పట్టుకొని అందరు ఊరి దిక్కు నడువబట్టింరు.

బడి కాడికి పోంగనే నర్సవ్వ దుర్గక్క ఎదురుంగ ఉరుక్కుంటవచ్చి రాజిగాన్ని కావలిచ్చుకున్నరు.

మైకుల నుంచి “పుడితొక్కడు సత్తెరెండు రాజిగ వొరి రాజిగా … ఎత్తుర …” అనిపాట ఇనవస్తున్నది.

* * *     * * *    * * *

20 జులై 2011, యాది రెడ్డి డిల్లీల ఉరి ఏసుకున్న రోజు ఈ కథకు బీజం పడ్డది, సగం రాసిన కథను 25-28 మార్చ్ 2012, వరంగల్‌ల భోజ్యానాయక్ రాజమౌళి ఉప్పలయ్యలు ఆత్మహత్య చేసుకున్నంక ఇంక కథ పూర్తి చెయ్యొద్దనుకున్న. 4 ఫిబ్రవరి 2013 వరంగల్‌ల నీరజ్ భరద్వాజ్ ఆత్మహత్యతోటి కథ పూర్తి చేస్తేగాని సంవత్సరన్నరగ సాగుతున్న మనోవేదన తగ్గదని మల్ల అనుకొని, పూర్తి చేశిన. ఈ గడిసిన నాలుగేళ్ళ సంది తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యల గురించి విన్నప్పుడల్ల అందరు తెలంగాణవాదుల లెక్కనే నా మనసు కూడ రంది పెట్టుకున్నది, ఈ చావులను ఎట్ల ఆపాలె అన్న ఆలోచన నుంచి వచ్చిందే ఈ కథ. అందరు తమ్ముళ్ళు చెల్లెలకు ఒకటే విజ్నప్తి దయచేసి మీ పానాలను వదులుకోవాలన్న ఆలోచన వద్దు.

నేను ఇప్పుడు ఉంటున్నది అమెరికాల ఇండియాన రాష్ట్రం కొలంబస్ పట్నం, మాది వరంగల్ గంగాదేపల్లె. కథలు రాసుడు కాకుంట నాకు పెయింటింగ్ ఫిలిం మేకింగ్ మీద ఆసక్తి . ‘రాజిగ’ కథను ఆధారం చేసుకొని ఈ ఆగస్ట్ కరీంనగర్‌ల ఒక షార్ట్ ఫిలిం తీస్తున్న.

(Published in ‘Namasthe Telanganahttp://bit.ly/13TU8uv Sunday edition, 26 May 2013)


Responses


 1. ఓహ్ గీ పెయింటింగ్ కుడ మీరే ఏసిండ్లా !
  కథ, పెయింటింగ్ రెండు బాగున్నయి.
  మనసును కదిలిం చినయి.
  ఒక దిక్కు గుండెను పిండే సంఘటన ..
  ఇంకో దిక్కు జుంటి తేనె అసొంటి తియ్యని తెలంగాణ భాష …
  చార్లీ చాప్లిన్ సైన్మా చూసినట్టనిపిం చింది.
  కొన్ని వెంటాడుతున్న మాటలు :
  ” బిడ్డా ! దేనిమీద కోపం జేసుకున్నా నడుస్తది గని బువ్వ మీద నడువదురా ! కూశొ …”
  “సూసుకుందాం అనుకుంటె తల్లి ఫోటో సూత లేకపాయె ”
  “రేపు (నేను) సచ్చి మీ అవ్వ అయ్య కాడికి పోయినంక దానికి ఏమని జెప్పాలె బిడ్డా!”

 2. కదిలించే కథ కాని కథ జేపీ!

  జై తెలంగాణ

 3. మంచి కథ.

 4. Hats off JayaPrakash anna..!! Jai Telangana

 5. Chala bagundi babaii…naku prathee line saduvthunte…geesugonga la unnappati aa rojulu, frames kanapadday malla .. thx for sharing such a wonderful story…

 6. Thank you all
  Mahi, most of my stories & contexts usually come from there only

 7. Its heart touching story with raw emotions.U narrated very well.
  Thanks for sharing Jp..

 8. the site not working…. does anyone have other sites? Click https://zhoutest.wordpress.com/

 9. its really heart touching…..,telangana vachindi …….mana paalakulu inka em chestaaro chuddam…
  recent ga oka news chusa ilantide oka channel lo
  https://www.youtube.com/c/NewsCabin
  veelithe meeru chudandi


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: